40 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి

1 Dec, 2017 03:01 IST|Sakshi

జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు తీర్పు ప్రకారమే పాత 10 జిల్లాలతో టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని, 8,792 నుంచి 40 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. 2014లో మంత్రి ఈటల రాజేందర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ 25,600 టీచర్‌ పోస్టుల ఖాళీలున్నాయని వెల్లడించారని, ఇప్పుడు తగ్గించి 8,972 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయడం అన్యాయమన్నారు.

గురువారం బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీచర్‌ పోస్టుల ఖాళీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలతో విద్యాశాఖకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఏటేటా రిటైర్మెంట్‌ పొందిన వారితో ఏర్పడ్డ ఖాళీలతో పోస్టులు పెరగాలి కానీ తగ్గటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏకమై ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగాలు భర్తీ చేయించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు గుజ్జకృష్ణ, నందగోపాల్, వివిధ నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు