టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

17 Mar, 2015 03:12 IST|Sakshi
  • సిట్టింగ్ ఎమ్మెల్సీ తిప్పేస్వామికి మళ్లీ అవకాశం
  • గుమ్మడి సంధ్యారాణి, వీవీవీ చౌదరిలకూ చాన్స్
  • అనూహ్యంగా తెరపైకొచ్చిన సంధ్యారాణి
  • సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఖరారు చే సింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి (అనంతపురం), గుమ్మడి సంధ్యారాణి (విజయనగరం), వీవీవీ చౌదరి (తూర్పు గోదావరి) ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వీరు మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. తిప్పేస్వామి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.

    రెండు విడతలుగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకరరరెడ్డికి ఆయన సన్నిహితుడు. వీవీవీ చౌదరి గతంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా పనిచేశారు. సంధ్యారాణి 2009 సాధారణ ఎన్నికల్లో సాలూరు నుంచి శాసనసభకు, గత సాధారణ ఎన్నికల్లో అరకు ఎస్టీ స్థానం నుంచి  లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. తొలుత వీవీవీ చౌదరి, బీద రవిచంద్రయాదవ్‌ల పేర్లను పార్టీ ఖరారు చేసినట్లు మీడియాకు ఆదివారం టీడీపీ వర్గాలు లీకులిచ్చాయి. దీంతో సోమవారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన రవిచంద్రకు పలువురు పార్టీ నేతలు అభినందనలు తెలియజేశారు.

    ఇదే సమయంలో బీద రవిచంద్రకు టికెట్ ఇస్తే తమకు ఇబ్బందులు తప్పవని రాష్ట్ర మంత్రితో పాటు నె ల్లూరుకు చెందిన నేత ఒకరు అధినేతకు స్పష్టం చేయటంతో చివరి నిమిషంలో తిప్పేస్వామిని ఎంపిక చేశారు. సంధ్యారాణి పేరును మంత్రి నారాయణ సిఫారసు చేశారు. దీంతో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారికి టికెట్ ఇవ్వకూడదనే నిబంధనను పక్కనపెట్టి ఆమెకు అవకాశమిచ్చారు.

    టికెట్ నిరాకరించడంతో ఒకరిద్దరు చంద్రబాబు ముందే కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. చంద్రబాబు సాయంత్రం తన నివాసంలో నేతలతో సమావేశమైన అనంతరం అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ వాటిని మీడియాకు వెల్లడించారు.

మరిన్ని వార్తలు