కారులో కయ్యం!

23 Sep, 2018 10:12 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు కక్కుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయంలో రగులుకున్న అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ నాయకులు ఒకవైపు రంగంలోకి దిగుతున్నా.. మరోవైపు అసమ్మతి నేతలు మెట్టు దిగకుండా తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాము చేసిన సేవలకు గుర్తింపుగా టికెట్‌ ఆశించగా.. దీనిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. సత్తుపల్లి, వైరా, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో అసమ్మతి కార్యకలాపాలు వేడెక్కుతుండటంతో పార్టీ విజయం కోసం అధినేత ప్రకటించిన అభ్యర్థుల గెలుపునకు జిల్లా నేతలు ఏకతాటిపైకి వచ్చి పనిచేసేలా వ్యూహాన్ని రూపొందిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతను స్వీకరించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పలు నియోజకవర్గాల నేతలు ఆశలు పెట్టుకున్నారు. అసమ్మతి నేతలకు నచ్చజెప్పి.. దారిలోకి తెచ్చే బాధ్యతను తుమ్మలపై పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరు అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్‌ తుమ్మలను ఖరారు చేశాక ఈనెల 14న తొలిసారి పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించిన తుమ్మల మళ్లీ వారంరోజుల విరామం తర్వాత జిల్లాలో పర్యటించి.. ఈసారి అసమ్మతి సెగలు కక్కుతున్న నియోజక వర్గాల్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పరోక్ష హెచ్చరికలు.. 
సదరు అభ్యర్థులకు మానసిక స్థైర్యం కల్పించడంతోపాటు అసమ్మతికి కాయకల్ప చికిత్స చేయాలని భావిస్తున్న ఆయన శుక్రవారం సత్తుపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తీరు.. చేసిన పరోక్ష హెచ్చరికలు రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేయడంలో భాగమేనని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్‌ ఎంపిక చేసిన సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవిని గెలిపించుకోలేకపోతే తాను వచ్చే మంత్రివర్గంలో ఉండటమే అనవసరమని వ్యాఖ్యానించడంతో పార్టీ కార్యకర్తలు.. నేతల్లోనూ ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమేనని, తనకోసం పని చేయాలని నియోజకవర్గంలో అసమ్మతి నేతలకు సైతం పరోక్షంగా చెప్పినట్లయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సత్తుపల్లిలో టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ తనకు టికెట్‌ రాకపోవడంతో భవిష్యత్‌ కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలవడం, సభలు, సమావేశాలు, మోటారు సైకిల్‌ ర్యాలీలు చేపట్టడం ద్వారా తనకు ప్రజలతో ఉన్న సంబంధాలు, కార్యకర్తల అండ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే మంత్రి తుమ్మలకు రాజకీయ భవిష్యత్‌ను ప్రసాదించిన సత్తుపల్లి నియోజకవర్గంలో అధినేత బలపరిచిన అభ్యర్థి పిడమర్తి రవిని గెలిపించాలన్న పట్టుదలతో తుమ్మల ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం అక్కడ పార్టీలోని రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.
  
మధిర, వైరాలో.. 
అదే రీతిన మధిర నియోజకవర్గంలోనూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించిన మంత్రి తుమ్మల.. మధిర అభ్యర్థిని గెలిపించుకోవడం చారిత్రక అవసరమని, ఇక్కడ మార్పు కోరుతున్న ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంట ఉన్నారని వ్యాఖ్యానించడం అక్కడి కార్యకర్తల్లోనూ నూతనోత్తేజం కలగడానికి ఉపయోగపడినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వైరా నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బాణోత్‌ మదన్‌లాల్‌పై అక్కడి నేతలు కొందరు రగిలించిన అసమ్మతి అగ్గి ఇప్పటికిప్పుడు సమసిపోయేలా కనిపించడం లేదు. రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించిన తుమ్మల తన నియోజకవర్గంతోపాటు మరో రెండు నియోజకవర్గాల్లో రాజకీయ పర్యటన చేసిన తుమ్మల.. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యకలాపాలపై ఇదే తరహాలో దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి గురు, శుక్రవారాల్లో చేసిన రాజకీయ పర్యటనలో రాజకీయ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనే దృష్టి సారించారన్న భావన క్షేత్రస్థాయిలో కలిగించడానికేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పరిస్థితుల ఆకళింపునకు ప్రయత్నం.. 
ఇక ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో దశలవారీగా పర్యటనలు చేయడం ద్వారా పార్టీ పరిస్థితులను ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదా లు, కొన్నిచోట్ల వర్గ పోరును తుదముట్టించాలని, ఇందుకోసం తమ ప్రాంతాల్లో పర్యటించాలని వస్తున్న విజ్ఞప్తులపై తుమ్మల ఆచితూచి స్పందిస్తూ.. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని భరోసా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఆయా నియో జకవర్గాల అభ్యర్థులతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరపడం ద్వారా రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు అందుకు అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకోవాలని పార్టీ యోచిస్తోంది.

ఇక పార్టీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి, అసమ్మతి వంటి పరిస్థితులున్నా.. ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆత్మీయ సమావేశాల పేరుతో నగరంలోని ప్రతి డివిజన్‌లో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కలిసి ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తుండగా.. సత్తుపల్లిలో పిడమర్తి రవి, మధిరలో లింగాల కమల్‌రాజ్, వైరాలో బాణోతు మదన్‌లాల్, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. సత్తుపల్లి, పినపాక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన ఆశావహులు మట్టా దయానంద్, వట్టం రాంబాబు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్‌ను పరీక్షించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైరా నియోజకవర్గంలో అసమ్మతి కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే బాణోత్‌ మదన్‌లాల్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న బొర్రా రాజశేఖర్‌తోపాటు పలువురు నేతలు మండలాలవారీగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో అసమ్మతి కార్యకలాపాలు వేడెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇల్లెందు నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌ అధికారిక అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సైతం అసమ్మతి సెగలు తప్పడం లేదు. అక్కడ టికెట్‌ ఆశించిన పార్టీ నాయకుడు దేవీలాల్‌ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించి కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. 

మరిన్ని వార్తలు