అమ్మ భాష బాగు కోసం.. సర్వశక్తులు ఒడ్డుతాం

16 Dec, 2017 01:58 IST|Sakshi

ప్రపంచ తెలుగు మహాసభల్లో కేసీఆర్‌ అధ్యక్షోపన్యాసం

గురువులతోనే భాషకు వైభవం వస్తది.. అలాంటి గురువులే నన్ను సానబెట్టారు

తొమ్మిదో తరగతిలోనే నేను పద్యాలు రాసిన..

పద్యాలు, గేయాలతో అలరించిన ముఖ్యమంత్రి ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు భాష గొప్పగా భాసిల్లేందుకు, వికసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతధా, సహస్రదా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భాష ఔన్నత్యాన్ని పెంచేందుకు, మరింత పరిపుష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లాల్‌బహదూర్‌ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పాల్కురికి సోమన ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై విశిష్ట అతిథులు, భాషాభిమానుల సమక్షంలో వేడుకలు మొదలయ్యాయి.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలుగు భాష ఔన్నత్యం, భాషా వికాసానికి జరిగిన కృషి, ప్రస్తుతం కవులు చేస్తున్న ప్రయత్నం, ప్రజా సంకల్పం తదితర అంశాలను ప్రస్తావించారు. తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసిన దాశరథి, కాళోజీల పేరిట పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని.. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ ఇటీవలే ఉత్తర్వులిచ్చామని తెలిపారు. ప్రస్తుతం భాషా పండితులు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని.. వాటిని వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వేమన, సుమతీ శతకాలు, పద్యాలు, సిద్దిపేటలో అవధానుల వైభవం, అజంత భాషగా తెలుగు ప్రత్యేకతలు వంటి అంశాలను వివరించారు. తెలుగు భాషా పాండిత్యాన్ని, అమ్మ భాషపై మక్కువను, విద్యార్థి దశలోని మధురానుభూతులను వేదికపై పంచుకున్నారు. కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

గురువుల చేతిలో దేశ భవిష్యత్తు
‘‘గురువులంటే చిన్నచూపు చూసేవారు. గతంలో బతకలేక బడిపంతులు అనేవారు. కానీ అది చాలా తప్పు. దేశం, సమాజ భవిష్యత్తును కాపాడే మార్గం చెప్పే వారే గురువులు. దేశ భవిష్యత్తును నిర్దేశించే శక్తి వారికి ఉంది. భావిపౌరులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కంకణం కట్టుకోవాలి. రాయిలాగా ఉన్న నన్ను అశేష జనం ముందు నిలబడి నాలుగు తెలుగు మాటలు మాట్లాడే స్థాయికి తెచ్చింది గురువులే. నాకు అబ్బిన భాష వారి చలవే. చిన్నప్పుడు నాకు తెలుగు బోధించిన మృత్యుంజయశర్మ గారిని మరువలేను. ఉత్తర గోగ్రహణం పాఠం చెప్పి వ్యాకరణ దోషం లేకుండా మరుసటి రోజు అప్పగిస్తే నోట్‌ పుస్తకం బహుమతిగా ఇస్తానన్నారు. నేను ఇప్పుడే అప్పగిస్తానంటే చెప్పు చూద్దామని పరీక్షించారు. అమ్మవారిని తలుచుకుని ఓ ఐదు సార్లు చదివి వెంటనే అప్పగించా. నాకు బహుమతిగా పుస్తకం తెప్పించి ఇచ్చారు. అప్పట్లో నేను రాఘవరెడ్డి అనే ఉపాధ్యాయుడి ఇంట్లో ఉండి చదువుకునే వాడిని. నా ప్రజ్ఞ గమనించి తన వద్దకు పంపాల్సిందిగా గురువుగారు ఆయనకు సూచించారు. ఉదయం ఐదున్నరకు మృత్యుంజయశర్మగారి ఇంటికి వెళ్లేవాడిని.. చదువులో, సాహిత్యంలో రాయిగా ఉన్న నన్ను సానబెట్టి మార్చారు. నేను రత్నంగా మారానో, లేదోగానీ ఈరోజు ఈ మహా వేదిక వద్ద మీ ముందు నిలబడి నాలుగు మాటలు మాట్లాడేస్థాయికి రాగలిగాను. దుబ్బాక చెరువు గట్టుపై తిరుగుతూ తొమ్మిదో తరగతిలోనే పద్యాలు రాసిన. ఇలాంటి గురువులుంటే భాషకు వైభవం వస్తది. గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ లాంటి గురువులు నాకు ఎంతో ఉపయోగపడ్డారు. గుమ్మ పద్యం చెప్తే గుమ్మపాలు తాగినట్టుండేది. సిద్దిపేటలో వికసించిన సాహితీ కుసుమాలకు కొదవనేలేదు.

పూత రేకంటే ఏమిటి..?
1972లో ఓసారి శోభన్‌బాబు సినిమా చూసిన.. అందులో హీరోయిన్‌ను వర్ణిస్తూ పూతరేకులాంటి లేత సొగసు అని పద ప్రయోగం ఉంది. పూతరేకంటే అర్థంగాక గురువును అడిగిన. అది పూలరేకు అయి ఉంటుందన్నరు. సినిమాహాలు ముందు పాటల పుస్తకం కొని చూస్తే అందులో కూడా పూతరేకనే ఉంది. గురువుగారు మరోసారి అడిగి ఆ పదం రాసుకుని విజయవాడలో తెలిసిన కవిని అడిగి పూతరేకంటే ఓ మిఠాయి పేరని తెలుసుకుని.. నాకు చెప్పిండ్రు. తనకు తెలియని విషయం నావల్ల తెలిసిందంటూ నన్ను కౌగిలించుకున్నారు. భాష, సాహిత్యం, సందేహం అడిగితే నివృత్తి చేయాలన్న తపన అప్పటి గురువుల్లో అలా ఉండేది. భాషను మరింత పరిపుష్టం చేయాలన్న తపన ఉండేది. అది ఇప్పుడు కావాలె.

తేట తెలుగు పదాలు అవి..
పోతన అద్భుతంగా భాగవతాన్ని మన ముం దుంచిండు. తేటతెలుగు పదాలు జాలువారినట్టుండే పద్యాలు ఉట్టిగనే అర్ధమైతయి. ‘నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు...’ఈ పద్యాల్లో కఠిన పదాలుండవు, సమాసాలుండవు. అర్థమ య్యే సాహిత్యం మాత్రమే ఉంటది. ‘ఇందుగలడందులేడని సందేహమ్ము వలదు..’పద్యంలో అందు ఇందు ఎందెందు. ఉట్టిగనే అర్ధమైతది. ‘మందార మకరందం..’కూడా అంతే కదా.. ‘బాలరసాలసాల నవపల్లవ..’అంటూ సాగిపోతుంది. ‘పాలసంద్రంలో పవళించేవాడు పరుల ఇండ్ల పాలుకోరనేల..’అంటూ అవసరమైతే దేవుడినే ధిక్కరించే ఆగ్రహం కవుల సొంతం. తెలంగాణలోనూ ఇలాంటి ధిక్కార స్వరం వినిపించిన కవులు ఎందరో ఉన్నారు. అప్పట్లో జీవిత సారాన్ని వివరించే సాహిత్యం విరివిగా అందుబాటులో ఉండేది..’’

తెలంగాణ కవులకు కితాబు
ఆనాడు అద్భుత సాహిత్యాన్ని పండించిన కవుల తరహాలోనే ఇప్పుడు తెలంగాణలోనూ కవులు భాషకు వన్నె తెస్తున్నారని కేసీఆర్‌ అభినందించారు. గోరటి వెంకన్న రాసిన పాటలు వింటే అందులో వర్ణన మన కళ్లముందే ఉన్నట్టు అనిపిస్తుందని, కొన్ని కన్నీళ్లు తెస్తాయని చెప్పారు. ‘గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది..’, ‘సంత మా ఊరి సంతా..’లాంటి పాటలను ఉదహరించారు. గోరటి అద్భుత వాగ్గేయకారుడని ప్రశంసించారు. జయజయహే తెలంగాణ గీతం రాసిన అందెశ్రీ, వానమ్మా వానమ్మా అంటూ గీతం రాసి ఆలపించిన జయరాజ్‌ తదితరులను ఉదహరించారు. అవధాని నాగఫణిశర్మ పద్యాలు ఆలపించి ఆకట్టుకుంటారని, తాను చిన్నప్పుడు పెరిగిన దుబ్బాక వెంకటరావుపేటలో కవులు ఎన్నో కావ్యాలు రాశారని చెప్పారు. తెలంగాణలో కవులు చాలామంది ఉన్నారని, సమయాభావం వల్ల పేర్లు చెప్పలేకపోయినందుకు క్షమించాలని కోరారు.

సాహిత్యం సంస్కారాన్ని ఇస్తుంది
‘‘అమ్మ ఒడే తొలి బడి, అక్కడి నుంచే మన జీవిత ఒరవడి, మన నడవడి మొదలవుతుంది. అమ్మ ‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలి పరమానంద రామగోవిందా...’అని పాడుతూ తన పిల్లలు రాముడు, గోవిందుడిలా ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటుంది. ప్రపంచానికి తన బిడ్డను, తన బిడ్డకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇందులో పద్యాలు, సాహిత్యానిదే ప్రధాన భూమిక. మా నాన్న చక్కటి గమనాన్ని సూచించారు. ‘శ్రీరాముని దయచేతను..’పద్యంలో ఇదే విషయం దాగి ఉంది. సాధారణంగా సరస్వతీ దేవి గుడిలో.. లేకుంటే ఏదో ఓ మందిరంలో అక్షరాభ్యాసం చేసి బడిలో వేస్తారు. ఊళ్లో బడి లేకుంటే అయ్యవారి బడికి పంపుతారు. నేను అలా అయ్యవారి బడికే వెళ్లా. అక్కడే మంచి నడవడిక అలవడింది. ‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారునేరును ద్విజుడున్‌’పద్యంలో చెప్పినట్టు.. జీవితంలో ముఖ్యమైన అండదండలు అవసరం. ఆ పద్యం చదివాక నాకో సందేహమొచ్చింది. ‘మన ఊళ్లో నిరంతరం పారే యేరు లేదుకదా..’అని మా గురువును అడిగితే... నిత్యం జలసిరి ఉండే చెరువులున్నా చాలని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు మంచి సంస్కారం, అవగాహనను మన సాహిత్యం అందిస్తుంది..’’

దృఢ సంకల్పం అవసరం..
తెలంగాణ గడ్డపై అద్భుతంగా వికసించి, విలసిల్లిన తెలుగు భాషా సాహిత్యం మరింత పరిపుష్టం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలుగు భాషను రక్షించుకోవాలనే దృఢ సంకల్పం అవసరమని ఉద్ఘాటించారు. ‘‘ఈ సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఒక్కటే విన్నపం. భాషకు ఎల్లలు లేనందున ఈ మాట చెప్తున్నా.. ఒక భాషా పండితుడు మరో భాషా పండితుడిని తయారు చేయాలి. ఒక కవి మరో కవిని తయారు చేయాలి. ఈ భాషా వికాస యజ్ఞానికి ప్రతి తెలుగువాడు నడుం బిగించాలి..’’ అని సీఎం పిలుపునిచ్చారు.


కోటి గొంతుల వీణలు: గవర్నర్‌
ప్రపంచ తెలుగు మహాసభలు కోటి గొంతుల వీణలని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మహా సభల ప్రారంభోత్సవంలో అభివర్ణించారు.   భాష, బతుకు మధ్య అవినాభావ సంబంధం ఉందని, తెలుగు మహాసభలు భువన విజయంలా సాగుతున్నాయన్నారు. గుండె నిండుగా తెలుగు పండుగ జరుగుతోందన్నారు. తెలుగు భాష కమ్మదనాన్ని భావితరాలకు మహాసభలు పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న తొలి తెలుగు మహాసభల్లో పాల్గొనడం మధురానుభూతి అని, ఎందరో మహానుభావులు తెలుగు భాషను సుసంపన్నం చేశారని కొనియాడారు. అవధానం తెలుగు వారికే సొంతం కావడం గర్వకారణమన్నారు. తెలుగు భాష అత్యంత పురాతనమైనదని, అజరామరమైనదని తెలిపారు.  

ఆంగ్ల మోజు తగ్గించుకుంటేనే..
అన్య భాషలపై ఆసక్తితో అమ్మ భాషను విస్మరించటం సమంజసం కాదని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు వ్యాఖ్యానించారు. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లినా మనం ఆంగ్లాన్ని వదలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష పరిరక్షణకు కమిటీ వేయాలని, ఇందుకు కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. మాతృభాషలోనే విద్యా బోధన అవసరమని యునెస్కో పేర్కొన్న విషయాన్ని అంతా గుర్తించాలని పేర్కొన్నారు. ఇంట్లో తెలుగు మాట్లాడి బడిలో ఆంగ్లం చదివితే విద్యార్థుల మేధస్సు పరిణతి చెందదన్నారు. ఏడాదిలో 365 రోజులు ఉంటాయన్న విషయాన్ని భాస్కరాచార్యులు వెయ్యేళ్ల క్రితమే చెప్పారని, ఆర్యభట్టు ప్రపంచానికి శూన్యం (సున్న) విలువ తెలియజెప్పిన తీరును ప్రపంచమంతా శ్లాఘిస్తుంటే.. మనం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తెలుగు బడుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

తెలంగాణవాదిని: అసదుద్దీన్‌
‘నేను ఢిల్లీలో ఉన్నçప్పుడు దక్షిణ భారతీయుణ్ని, తెలంగాణలో తెలంగాణవాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే హైదరాబాదీని’అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన తెలుగు ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ–ముస్లింల ఐక్యతకు ఉదాహరణగా నిలిచిందని, పాలు–నీళ్లలా కలిసిపోయారని ఆయన అన్నారు.  పాతబస్తీకి చెందిన హమీదుల్లా షరీఫ్‌.. పవిత్ర ఖురాన్‌ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారని, గఫూర్‌ తెలుగులో ఎన్నో సాహితీ ప్రక్రియలు రాశారని గుర్తు చేశారు. ఉర్దూ, తెలుగు భాషలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. తొలిసారి తెలుగులో ప్రసంగించిన అసదుద్దీన్‌.. తన ప్రసంగంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మన్నించాల్సిందిగా ఉర్దూలో సభకు విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు