వచ్చే నెల మొదటివారంలో ఎంసెట్‌ ఫలితాలు!

25 May, 2019 02:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేనెల మొదటివారంలో తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్‌ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎంసెట్‌ ఫలితాలను వెల్లడించాలని ఎంసెట్‌ కమిటీ భావిస్తోంది. రీవెరిఫికేషన్‌ ఫలితాల అనంతరం ఇంటర్మీడియట్‌ మార్కులకు ఎంసెట్‌ ర్యాంకుల ఖరారులో 25 శాతం వెయిటేజీని ఇచ్చి తుది ర్యాంకులను ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఇంటర్‌ బోర్డు ఆ ఫలితాలను వెల్లడిస్తే వచ్చే నెల మొదటి వారంలో ఎంసెట్‌ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు ఆలస్యమైతే ఎంసెట్‌ ర్యాంకుల వెల్లడి కూడా ఆలస్యం కానుంది. 

చివరి దశకు చేరుకున్న అనుబంధ గుర్తింపు ప్రక్రియ 
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కాలేజీల్లోని లోపాలను గుర్తించి గత నెలలోనే వాటిని సరిదిద్దుకునేలా సమయం ఇచ్చిన జేఎన్‌టీయూ అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను ఇటీవల చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 100 ఇంజనీరింగ్‌ కాలేజీలకు, 40 వరకు ఫార్మసీ, ఎంబీఏ కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేసినట్లు జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.యాదయ్య తెలిపారు. ఈనెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని, అప్పటివరకు ఎన్ని కాలేజీలకు, ఎన్నిసీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చామన్నది చివరలో తెలుస్తుందని వివరించారు.
 

మరిన్ని వార్తలు