సచివాలయ భవనాలు కూల్చాల్సిందే...

4 Mar, 2020 01:41 IST|Sakshi

ఇప్పుడున్న భవనాలు వినియోగానికి పనికిరావు

కొత్త సచివాలయాన్ని కట్టాల్సిందే

రాజకీయంగానే పిల్స్‌ వేశారు

హైకోర్టులో ప్రభుత్వ వాదన

విచారణ 5వ తేదీకి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడున్న సచివాలయ భవనాలు వినియోగానికి యోగ్యంగా లేవని, కొత్తగా భవనాల్ని నిర్మించడమే ఏకైక మార్గమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ వాదనలతో 33 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వాటిలోని అంశాల్ని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఎదుట వినిపించారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారని ఏజీ ఆరోపించారు.

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాన్ని పిల్స్‌ పేరిట సవాల్‌ చేయడానికి వీల్లేదని చెప్పారు. పిల్స్‌ దాఖలు చేసిన వారిలో జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ, ఎంపీలుగా ఉన్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, రాజకీయ పార్టీల నేతలు పిల్స్‌ దాఖలు చేయకూడదని ఏమీ లేదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా దాఖలు చేసిన వ్యాఖ్యాలను డిస్మిస్‌ చేయాలని, కొత్తగా సచివాలయ భవనాల్ని నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని వాదించారు. మంత్రివర్గం లోతుగా పరిశీలించిన తర్వాతే 2019 జూన్‌ 18న సచివాలయాన్ని ఇతర భవనాలకు తరలించారన్నారు.

టెక్నికల్‌ కమిటీ నివేదిక ఆధారంగానే మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, అగ్నిమాపక శాఖ కూడా నివేదిక ఇచ్చిందన్నారు. ఇప్పుడున్న భవనాలు 50 నుంచి 70 ఏళ్ల వరకూ వినియోగించవచ్చునని పిటిషనర్లు చెబుతున్నారేగానీ అందుకు సంబంధించిన సాంకేతిక నివేదికలను పిటిషనర్లు ఇవ్వలేదన్నారు. భవనాల మధ్య అగ్నిమాపక వాహనాలు తిరిగేందుకు కూడా దారి లేదని, అగ్నిప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని, పైపుల లీకేజీలతో భవనాలు దెబ్బతిన్నాయని చెప్పారు. భవనాలకు విద్యుత్‌ వైరింగ్‌ చేసి పాతికేళ్లు అయిందని, షాట్‌సర్క్యూట్‌ అయిన ఘటనలు కూడా ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 33 జిల్లాలకు పెరిగాయని, కలెక్టర్లు, శాఖాధిపతులు 500 మందితో సమావేశాన్ని నిర్వహించేందుకు హాలు కూడా లేదన్నారు. దేశ విదేశీ ప్రతినిధులు వచ్చినా, వ్యాపార ఒప్పందాలు చేసుకునేందుకు కూడా ఆ స్థాయికి తగిన సమావేశ మందిరాలు లేవని తెలిపారు.

భవనాలను నిర్మించి చాలా సంవత్సరాలు అయ్యాయని, డి, హెచ్‌ బ్లాక్‌లు మాత్రమే సక్రమంగా ఉన్నాయని, మిగిలిన బ్లాక్‌లు ఏమాత్రం వినియోగానికి యోగ్యంగా లేవన్నారు. జి బ్లాక్‌ 131 ఏళ్ల క్రితం నిర్మించారని, సి బ్లాక్‌ 1978లో, ఏ బ్లాక్‌ 21 ఏళ్ల క్రితం నిర్మించారని ఆయన వివరించారు. ఏపీ సచివాలయ భవనాల్ని గత ఏడాది జూన్‌ 22న తెలంగాణకు అప్పగించారని, వాటిని అయిదేళ్లుగా వినియోగించకపోవడం వల్ల బాగా పాడయ్యాయని ఏజీ ప్రసాద్‌ చెప్పారు. సచివాలయ భవనాల వినియోగ సామర్ధ్యంపై స్వతంత్ర సంస్థ లేదా హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులతో పరీక్షించి నివేదిక తెప్పించుకునే ఉత్తర్వులు ఇవ్వాలని జీవన్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌తో కూడిన నలుగురు ఇంజినీర్ల కమిటీ నివేదికను విశ్వాసంలోకి తీసుకోలేనప్పుడు మీ పిల్‌ను ఎలా నమ్మాలని ప్రశ్నించింది. కోర్టు సమయం ముగియడంతో వాదనలు ఈ నెల 5కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు