Sakshi News home page

సింగరేణి ఎన్నికల వాయిదాకు నో

Published Fri, Dec 22 2023 4:33 AM

High Court No for postponement of Singareni election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి గురింపు సంఘం ఎన్నికల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గతంలో చెప్పిన విధంగా డిసెంబర్‌ 27న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించాలని స్పష్టంచేసింది. ఎన్నికల వాయిదా కోరుతూ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సీజే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్ర స్తుత పరిస్థితుల్లో నిర్వహించలేమని, గడువు కావా లంటూ యాజమాన్యం సెపె్టంబర్‌లో హైకోర్టును ఆశ్రయించింది.

ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారని చెప్పింది. వరుస పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఎన్నికల సంఘం పలు భేటీలు నిర్వహించనుందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి ఎన్నికల వాయిదాకు నిరాకరిస్తూ అక్టోబర్‌ 28న నిర్వహించాలని ఆదేశించారు.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్‌సీసీఎల్‌ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై నాడు విచారణ జరిపిన సీజే ధర్మాసనం.. వాయిదాకు అంగీకరిస్తూ, డిసెంబర్‌ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున నాడు విచారణకు హాజరైన అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) కూడా ఎన్నికలు డిసెంబర్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు అఫిడవిట్‌ కూడా దాఖలు చేశారు.  

ప్రభుత్వం అక్టోబర్‌లో సమ్మతించింది.. 
డిసెంబర్‌ 27న కూడా ఎన్నికలు నిర్వహించలేమని, మార్చి వరకు వాయిదా వేయాలని కోరుతూ గత వారం ప్రభుత్వం ప్రధాన పిటిషన్‌లో మధ్యంతర అప్లికేషన్‌ (ఐఏ) దాఖలు చేసింది. కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఐఏపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొద్ది రోజుల క్రితమే కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పోలీస్‌ అధికారుల బదిలీలు చేపడుతోందన్నారు. ఎన్నికల నిర్వహణకు పోలీస్‌ బందోబస్తు అత్యంత కీలకమని, ఈ క్రమంలో ఇప్పటికిప్పుడే కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేమంటూ వాయిదా వేయాలని కోరారు.

వాదనలు విన్న ధర్మాసనం.. అక్టోబర్‌ 11న ఇచ్చిన ఉత్తర్వులను మార్చేందుకు నిరాకరించింది. అక్టోబర్‌లో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సమ్మతిస్తూ తమకు హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. ఆ హామీ మేరకు డిసెంబర్‌ 27న ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తేల్చిచెప్పింది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement