ఏడాదిలో 2 లక్షల ఎకరాలకు నీరు

16 Dec, 2019 02:55 IST|Sakshi

కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 పనుల పూర్తికి ప్రభుత్వం నిర్ణయం

నేడు ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్న సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించి చేపట్టిన ప్యాకేజీ–21లోని పైప్‌లైన్‌ వ్యవస్థ నిర్మాణ పనుల వేగిరంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రాజెక్టులోని కీలక పనులన్నీ ముగింపు దశకు వస్తుండటం, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీటి లభ్యత పెంచిన నేపథ్యం లో ఈ పైప్‌లైన్‌ పనులను వేగిరం చేసి ఏడాదిలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. కనీసం 2 లక్షల ఎకరాల మేర సాగునీరు వృద్ధిలోకి వచ్చే అవకాశాలుండటంతో పనులను సత్వరమే పూర్తి చేసే లక్ష్యంగా ఇంజనీర్లను మార్గదర్శనం చేసేందుకు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ సోమ వారం ప్యాకేజీ–21 పరిధిలో పర్యటించనున్నారు.

భూగర్భంలో పైపులైన్లు 
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఫోర్‌షోర్‌ నుంచి నీటిని తీసుకుంటూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు కోరుట్ల ప్రాంతాలకు నీరిచ్చేలా కాళేశ్వరంలో ప్యాకేజీ–20, 21, 21(ఎ) పనులు చేపట్టా రు. ప్యాకేజీ–20లో ఎస్సారెస్పీ ఫోర్‌ షోర్‌ నుంచి అప్రోచ్‌ చానల్, 17.81 కి.మీ. టన్నెల్, 30 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న 3 మోటార్లతో పంప్‌హౌస్‌ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ. 892 కోట్ల తో చేపట్టిన ఈ పనులు 80% వరకు పూర్తయ్యా యి. ఇక్కడి నుంచి మాసాని చెరువులోకి నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి 2 పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసి, పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు చేపట్టారు.

సాధారణంగా కాల్వల నిర్మాణం చేపడితే భూసేకరణ 7 వేల నుంచి 8 వేల ఎకరాలు చేయాల్సి ఉంటుంది. అదే పైప్‌లైన్‌ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద భూగర్భాన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. ప్యాకేజీ–21 పనులను రూ.610 కోట్లతో చేపట్టగా, 30 శాతం పూర్తయింది. టన్నెళ్ల నిర్మాణం, కాల్వల పనులు పూర్తి చేయాలి. ప్యాకేజీ–21(ఎ) కీలకం కాగా దీన్ని రూ. 2,623 కోట్లతో చేపట్టారు. దీనిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలి. ఈ పనులు ఇప్పుడిప్పుడే పుంజుకున్నాయి.

భూసేకరణ సమస్య వల్ల ఆటంకం ఎదురవుతోం ది. రెండు పంప్‌హౌస్‌ల నిర్మాణం, 10 నుంచి 8 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్ల ఏర్పాటు చేయాలి. ఈ పనులు వేగంగా చేయాల్సి ఉండగా, భూగర్భ పైప్‌లైన్‌ పనులు కొనసాగుతున్నాయి. 90 కి.మీ. మేర పైప్‌లైన్‌ పూర్తి చేయాల్సి ఉండగా, ఇందులో కొంత పని పూర్తయింది. వీటిని వచ్చే ఏడాది డిసెంబర్‌ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. చిన్నచిన్న అవాంతరాలు, భూసేకరణ సమస్యలుండటంతో వాటి పరిష్కారానికి స్మితా సబర్వాల్‌ సోమవారం ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. పనుల వేగిరానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శనం చేయనున్నారు.

కన్నెపల్లిలో ‘స్పైరల్‌’ పనులు ముమ్మరం 
కాళేశ్వరం ప్రాజెక్టుకు రానున్న ఆరు మోటార్లు 
కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌లో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నీటి లభ్యతను బట్టి మరో టీఎంసీని అదనంగా ఎత్తిపోయడానికి సరిపడా మోటార్లు బిగించడానికి ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. పనులు త్వరగా పూర్తి చేయడానికి ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించడానికి కన్నెపల్లి పంపుహౌస్‌లో 11 మోటార్లు బిగించి వెట్, డ్రై రన్‌లు పూర్తి చేశారు. ప్రస్తుతం నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.

మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో 85 గేట్లు మూసివేసి బ్యాక్‌వాటర్‌ను అక్కడి మోటార్లతో ఎత్తిపోస్తూ గ్రావిటీ కాల్వద్వారా అన్నారంలోని సరస్వతీ బ్యారేజీని నింపుతున్నారు. మరో టీఎంసీని తరలించడానికి అదనంగా 6 మోటార్లు బిగించడానికి పనులు సాగుతున్నా యి. ఇందులో స్పైరల్‌ కేసింగ్‌ పనులు 3 మోటార్లకు పూర్తికాగా, మరో 3 మోటార్ల పనులు జరుగుతున్నాయి. మొత్తం 6 మోటార్లకు 12 కి.మీ. వరకు పైపులైన్‌ నిర్మించాల్సి ఉండగా.. 9 కిలోమీటర్ల మేర పైపులైన్‌ పూర్తయింది. అదనపు టీఎంసీ తరలింపునకు ఆస్ట్రియా, ఫిన్‌లాండ్‌ దేశా ల నుంచి 6 మోటార్లను తెస్తున్నారు. ఇవి సకాలంలో వస్తే మార్చి చివ రికి 3 టీఎంసీల నీటిని తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా