‘నాలా’ ఫీజులపై దృష్టి

26 Nov, 2019 04:26 IST|Sakshi

విజిలెన్స్‌ విచారణలో వెల్లడయిన భూముల పన్ను కట్టించండి

జిల్లాల వారీ విస్తీర్ణంతో సీసీఎల్‌ఏ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: ఐదేళ్ల నుంచి ఎగ్గొట్టిన నాలా (వ్యవసాయేతర భూ మదింపు చట్టం) ఫీజులను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి ఇప్పటివరకు రూ. 815.48 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా యం రావాల్సి వుండగా.. రెవెన్యూ శాఖ పట్టించుకోవట్లేదని ఇటీవల విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిగ్గు తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 105 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించింది. జిల్లాలవారీగా విజిలెన్స్‌శాఖ ఈ నివేదికను అందజేసింది. వ్యవసాయ భూములు.. ఇతర అవసరాలకు మార్పిడి చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ విలువలో 3 శాతాన్ని చెల్లించాలి.

కొందరు రియల్టర్లు, బడా బాబులు ఇవేమీ పట్టించుకోకుండా వ్యవసాయేతర అవసరాలకు భూములను మళ్లిస్తున్నారు. లేఔట్లను అభివృద్ధి చేసుకోవడమో లేక పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపార సంస్థలను నెలకొల్పడమో చేశారు. ఇలా భూ వినియోగ మార్పిడి ఫీజు చెల్లించకుండా.. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన కేసులను గుర్తించిన విజిలెన్స్‌ విభాగం.. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఇటీవల ఆదాయ వనరులను సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు.. పెండింగ్‌లో ఉన్న నాలా ఫీజులను వసూలు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో జిల్లాలవారీగా రావాల్సిన నిధులను తక్షణమే వసూలు చేయాలని ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు.

మరిన్ని వార్తలు