ప్రైవేట్‌ ల్యాబ్‌లకు సర్కారు పరీక్ష

28 Jun, 2020 01:32 IST|Sakshi

ఆయా ల్యాబ్‌లు చేపట్టిన కరోనా టెస్టులపై విచారణ

ప్రభుత్వ ల్యాబ్‌లలో మళ్లీ శాంపిళ్ల పరీక్ష

ఆ ఫలితాల ఆధారంగా  కార్యాచరణ

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

లక్షణాలు లేకుంటే పరీక్షలు వద్దంటున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబ్‌లు, కొన్ని ప్రముఖ ఆస్పత్రులు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఆయా ల్యాబ్‌లు ఇప్పటికే చేసిన పరీక్షల నమూనాలను ర్యాం డమ్‌గా సేకరించి తిరిగి ప్రభుత్వ ల్యాబ్‌లలో వాటిని పరీక్షించి ఫలితా లను పోల్చి చూడనుంది. తద్వారా ప్రైవేట్‌ ల్యాబ్‌ల ఫలితాలు సరిగా ఉన్నాయో లేదోననే నిర్ధారణకు రానుంది. ఏమాత్రం తేడా వచ్చినా తదుపరి చర్యలు తీసుకొనే అవకాశముంది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిబంధనల ప్రకారం ప్రైవేటు ల్యాబ్‌లు పరీక్షలు నిర్వహించలేదని, ఫలితాల్లో తప్పులు దొర్లాయని, నెగెటివ్‌ వచ్చినా పాజిటివ్‌గా ఫలితాలు చూపాయనే సందేహాలున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం తేల్చిచెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఐసీఎంఆర్‌ ఆదేశాల మేరకు తనిఖీలు...
రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ అనుమతించిన కొన్ని ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లలో కొన్ని రోజులుగా అనేక మంది పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే పరీ క్షల ఫలితాలపై అనుమానాలున్నాయని, వాటిపై తనిఖీ చేయాలని ఐసీఎంఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండ్రోజుల క్రితం కోరిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.

ఆ మేరకు బృందాలను రంగంలోకి దింపామని ఆయన వివరించారు. ఆ తనిఖీల్లో అనేక తప్పులున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ‘కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రస్తుతం దీన్ని వ్యాపార కోణంలో చూడకూడదు. కానీ కొన్ని ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లు లక్షణాలున్నా, లేకపోయినా ఇష్టారాజ్యంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాయి’అని ఆయన తెలిపారు. కొన్ని ల్యాబ్‌లకు కనీసం శాంపిళ్లను సేకరించే పద్ధతి కూడా తెలియదని విమర్శించారు.

ప్రైవేటులో చేయించుకోవాలా వద్దా?
ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకోవాలా వద్దా అన్న సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ‘ఫలానా డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో నిర్వహించిన పరీక్షలు తప్పుల తడకగా ఉన్నాయని, మిగిలిన వాటిలో సరిగానే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండేది. అలా కాకుండా అన్నింటినీ కలిపి తప్పుల తడక అనడం వల్ల ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకోవాలో వద్దో అర్థం కావట్లేదు’అని కరోనా లక్షణాలు ఉన్న పలువురు పేర్కొంటున్నారు. ఐసీఎంఆర్‌ ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చినప్పుడు వాటి సామర్థ్యాలు చూసుకోలేదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

కరోనా వ్యాప్తి, లక్షణాలున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించుకొనే పరిస్థితి లేకుండా పోయిందని, ఇప్పుడు ప్రైవేటు ల్యాబ్‌ల ఫలితాలు సరిగ్గా లేవంటే లక్షణాలున్న వారు ఎక్కడకు వెళ్లాలని పలువురు అడుగుతున్నారు. వాస్తవానికి సాధారణ క్షయ వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు... పేరుగాంచిన డయాగ్నస్టిక్‌ సెంటర్లు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో తప్పులు ఎలా జరుగుతాయని ఇంకొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకున్న వారిలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ వచ్చిన వారు ఏది కరెక్టో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు. 

ప్రైవేటు చికిత్సలపైనా దృష్టి
ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న కరోనా చికిత్సలపైనా సర్కారు దృష్టిసారించింది. లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయడమే కాకుండా చికిత్స పేరుతో కొన్ని ఆస్పత్రులు రూ. లక్షలు గుంజుతుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. తాము ఖరారు చేసిన ఫీజులను ఏమాత్రం పట్టించుకోకుండా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతుండటంతో వాటిల్లో తనిఖీలు, ఆకస్మిక దాడులు చేసే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు