మళ్లీ ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ!

28 Jun, 2020 01:16 IST|Sakshi

విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

భూముల సంరక్షణపై సమీక్షలో మంత్రులు కేటీఆర్, తలసాని

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో పేదలు కబ్జాచేసి ఇళ్లు నిర్మించుకున్న ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే జీవో 58, 59 ద్వారా క్రమబద్ధీకరించామని, మరోసారి ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర మం త్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హామీనిచ్చారు. హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ భూముల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులిద్దరూ శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, దేవా దాయ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడటానికి వాటికి జియో పెన్సింగ్, జీఐఎస్‌ మ్యాపింగ్‌ చేయాలన్నారు. ప్రభుత్వ భూములపైన ఉన్న వివాదాల పరిష్కారానికి కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించాలని కేటీఆర్‌ సూచించారు.

ప్రభుత్వ భూముల రక్షణకు రెవెన్యూ శాఖతో జీహెచ్‌ఎంసీ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకున్న అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్‌ అధికారులను అదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా, వాటిలో అక్రమ నిర్మాణాలు ఏర్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మరింత చొరవతో పనిచేయాలని సూచించారు. దశాబ్దాల కింద తీసుకున్న లీజులను సమీక్షించి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియమ నిబంధనలు మార్చి ఆయా శాఖలకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలన్నారు.

సమావేశంలో పాల్గొన్న ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పలు సమస్యలను ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తెచ్చారు. అర్హులైన పేదలకు జీవో నంబర్‌ 58, 59 ద్వారా ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు మరో అవకాశం కల్పించాలని, గంపగుత్తగా అందరికీ అవకాశం కల్పించకుండా అంశాలవారీగా సానుకూల దృష్టితో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కూమార్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, ఎండోమెంట్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు