‘గుట్ట’ చుట్టూ అభయారణ్యం

26 Nov, 2014 02:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ అభయారణ్యం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి కేంద్రంగా చుట్టూ ఉన్న 5 గ్రామాల పరిధిలోని 2 వేల ఎకరాల్లో ఈ అభయారణ్యం నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందులో అభయారణ్యంతోపాటు భక్తులకు విశ్రాంతి గృహాలు, ఆద్యాత్మిక కేంద్రాలు, కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. యాదగిరి గుట్ట మండలం యాదగిరిపల్లి, గిండ్లపల్లి, సైదాపూర్, దాతర్‌పల్లి గ్రామాలతోపాటు భువనగిరి మండలం రాయగిరి గ్రామం నుంచి అభయారణ్యం కోసం భూములు సేకరించేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

 

ఈ మేరకు భువనగిరి ఆర్డీఓ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో గుట్టను అభివృద్ధి చేసేందుకు ‘యాదగిరి గుట్ట పట్టణాభివృద్ధి సంస్థ (ఉడా)’ను ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అభివృద్ధికి నగరాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిట్లుగానే యాదగిరిగుట్ట అభివృద్ధికి సైతం ఓ సంస్థను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని సీఎం కార్యాలయం నుంచి పురపాలకశాఖకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. గతనెల 17న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని స్వయంగా సందర్శించిన కేసీఆర్ రెండు మూడేళ్లలో గుట్ట చుట్టూ ఉన్న 2 వేల ఎకరాల్లో టెంపుల్ సిటీని నిర్మిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతలను కొత్తగా ఏర్పాటయ్యే ‘ఉడా’కు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.


 

మరిన్ని వార్తలు