బడికి వేళాయె!

12 Jun, 2019 08:58 IST|Sakshi

పాలమూరు: బడిగంటలు మోగాయి.. వేసవి సెలవుల్లో అమ్మమ్మ, నానమ్మ ఊర్లకు వెళ్లి సరదాగా గడిపిన విద్యార్థులు నేటినుంచి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు ఈనెల 1వ తేదీనే తెరుచుకోవాల్సిన పాఠశాలలు ఎండలు మండుతుండడంతో ప్రభుత్వం 12వ తేదీన  ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో నేటినుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలలను మొదటిరోజు  అట్టహాసంగా ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయగా ఉపాధ్యాయులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా గ్రామాలు, పట్టణాల్లో తమదైన శైలిలో ప్రచారాలు చేసి నేడు ఆర్భాటంగా పాఠశాలలను ప్రారంభించనున్నారు.

ముందేచేరిన పుస్తకాలు 
పాఠశాలల ప్రారంభం రోజునే తరగతులు కూడా ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకు తగ్గట్టు ముందుగానే అవసరమైన పాఠ్యపుస్తకాలను అందజేశారు. నేటినుంచి పాఠశాలలు తెరుచుకోనున్నడంతో పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు, స్కూల్‌ యూనిఫాం ఇతర వస్తువులను కొనుగోలు చేస్తూ తల్లిదండ్రులు బిజీగా కనిపించారు. జిల్లా కేంద్రంలో ఉన్న బుక్‌సెంటర్లు, షూ సెంటర్లు, బట్టల దుకాణాల్లో సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 2601 ప్రాథమిక పాఠశాలలు, 567 ప్రాథమిక కొన్నత పాఠశాలలు, 575 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా 1750 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా  దాదాపు 10లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో చదువుకుంటున్నారు. ఇదిలాఉండగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 212 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 1,167 ప్రాథమికొన్నత ప్రాథమిక పాఠశాలలు, 383 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నూతనంగా వచ్చిన పాఠశాలలు కాకుండా 150 ప్రాథమిక పాఠశాలలు, 213 ఉన్నత పాఠశాలలుండగా 85,511 మంది విద్యార్థులు చదువుతున్నారు.

సామాన్యులకు ఆర్థికభారం 
జూన్‌ మాసం వచ్చిందంటే సామాన్యులకు ఆర్థిక, అప్పుల భారం పెరుగుతోంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల సంగతి చెప్పనక్కరలేదు. 1వ తరగతి నుంచి  5వ తరగతి విద్యార్థులకు రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.22వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు ప్యాకేజీ కింద రూ.40 వేల నుంచి  రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దాంతోపాటు సాధారణ స్కూల్‌ ఫీజులే కాకుండా డోనేషన్లు, అడ్మిషన్‌ ఫీజులు, స్పెషల్‌ ఫీజులు, ట్యూషన్‌ ఫీజులు, ల్యాబ్‌ ఫీజులు, రికార్డులు, బస్సు ఫీజులు, టైలు, బెల్టులు, ఐడెంటీ కార్డులు, పుస్తకాలు, వంటివి బయట కొనుగోలు చేయకుండా నిబంధనలు ఏర్పాటు చేసి వారి పాఠశాలల్లోనే కొనాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. దీంతో విద్యార్థులు ఎక్కడ కూడా చెప్పలేక యాజమాన్యాలు చెప్పనదానికి తల ఊపాల్సి వస్తోంది. దానికితోడు పెరిగిన ధరలు కూడా తల్లిదండ్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారికి పెన్సిల్‌ దగ్గరి నుంచి స్కూల్‌ ఫీజుల వరకు వేలల్లో ఖర్చు అవుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించడం కష్టంగా మారుతోంది.

మరిన్ని వార్తలు