సిటీలో రికార్డ్స్‌ ఇవీ..

12 Jun, 2019 09:05 IST|Sakshi
2016లో ఐపీఎల్‌ విజేతగా సన్‌రైజర్స్‌ జట్టు.. ట్రోఫీ అందుకున్న సందర్భంగా భార్య హెజల్‌ కీచ్‌తో యువరాజ్‌ సింగ్‌

అతని సిక్స్‌లు ఓ ప్రభంజనం

సిటీ అంటే ఎంతో మక్కువ  

సిటీ స్టేడియాల్లోనూ పరుగుల రికార్డ్‌

యువరాజ్‌ రిటైర్మెంట్‌పై అభిమానుల ఆవేదన

హిమాయత్‌నగర్‌: యువరాజ్‌ సింగ్‌.. ఇండియన్‌ క్రికెట్‌లో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న అందమైన ఆటగాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత హైదరాబాదీలను అంతగా ఆకట్టుకున్న క్రికెటర్‌ యూవీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాట్‌ పట్టి క్రీజ్‌లోకి వస్తే చాలు ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ ప్లేయర్‌ వీర బాదుడికి బంతులు బౌండరీలు దాటితే ప్రత్యర్థుల గుండెల్లో స్కోర్‌ బోర్డుపరుగులు పెట్టాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూవీ.. తను ఆడే ఆటకు, బాదే షాట్స్‌కి, సిక్స్‌లకు కోట్ల మంది ఫ్యాన్స్‌ ఫిదా అవుతుంటారు. యూవీపై అభిమానంతో లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటింగ్‌ను నేర్చుకున్న సిటీలోని కొందరు క్రికెటర్లు, అతడి ఆట తీరును అభిమానించే మరికొందరు ఇప్పుడు యువరాజ్‌ రిటైర్మెంట్‌ను జీర్ణించుకోలేకపోతున్నారు. సిటీ వచ్చినప్పుడుఆడిన ఆట తీరు, రికార్డ్స్, రిటైర్మెంట్‌పై అభిమానులు తమ మనసులోని మాటను ‘సాక్షి’తో పంచుకున్నారు.  

ఎల్‌బీ స్టేడియంలో 16–03–2002లో జింబాబ్వేపై ఆడిన మ్యాచ్‌లో 80 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది.  
ఇదే ఎల్‌బీ స్టేడియంలో న్యూజ్‌లాండ్‌పై 15–11–2003లో జరిగిన మ్యాచ్‌లో సాధించింది ఏడు పరుగులే అయినా ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ గెలిచింది.  
ఉప్పల్‌లో స్టేడియం నిర్మించాక తొలి మ్యాచ్‌ 16–11–2005లో సౌతాఫ్రికాపై యూవీ 103 పరుగులు సాధించాడు.  
చివరిగా 5–11–2009లో ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాపై ఆడాడు.  
ఐపీఎల్‌(2016)లో యువరాజ్‌ సన్‌రైజర్స్‌ తరఫున 10 మ్యాచ్‌లు ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజేతగా ఆ ఏడాది మే 29వ తేదీన కప్పును అందుకున్న యూవీ.. ‘హైదరాబాద్‌ నాకు చాలా ప్రత్యేకం’ అంటూ ఉద్విగ్నంగా చెప్పాడు.  
2017లో ఏప్రిల్‌ 5న రాయల్స్‌ చాలెంజర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. 27 బంతులకు 62 పరుగులు సాధించి హైదరాబాదీలను ఉర్రూతలూగించాడు.   

 యూవీని మిస్‌ అవ్వను
చిన్నప్పటి నుంచి యూవీ ఆట చూసి పెరిగాను. నాకు యూవీ అంటే చాలా ఇష్టం. 2007–2011 ప్రపంచకప్‌ను యూవీ కోసం ఒక్కరోజు కూడా మిస్‌ అవ్వకుండా చూశాను. యూవీ ఓ మంచి ఆటగాడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి. 2003లో ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్‌ పోటీల్లో ఇంగ్లాండ్‌పై మహ్మద్‌ కైఫ్‌తో కలిసి టీమ్‌ని గెలిపించిన విజువల్స్‌ ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. భారత్‌ జట్టు కోసం ఎన్నో విజయాలను ఇచ్చిన యువరాజ్‌ ప్రపంచం గర్వించదగ్గ ఆటగాడు. అటువంటి వ్యక్తి రిటైర్మెంట్‌ అవడం బాధగా ఉంది. మరోపక్క ఆయనకు మంచి ఫేర్‌వెల్‌ ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.– హనుమా విహారి, ఇండియన్‌ క్రికెటర్‌

కమిట్‌మెంట్‌ ఉన్న ఆటగాడు
భారత్‌ జట్టుని గెలిపించాలనే కమిట్‌మెంట్‌ ఉన్న ఆటగాడు యూవీ. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో తను వందశాతం పర్‌ఫెక్ట్‌గా ఆడేవాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అతను ఫ్రంట్‌కు వచ్చి కొట్టే సిక్స్‌లకు నేను ఫిదా. యూవీని అనుసరిస్తూ పెరిగాను, ఆట నేర్చుకున్నాను. ఇప్పుడు అతను రిటైర్‌ అవడం తట్టుకోలేకపోతున్నాను.– ప్రతీక్, లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌

అతడి సిక్స్‌లకు ఫిదా
యూవీ ఫ్రంట్‌కు వచ్చి కొట్టే సిక్సెస్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. యూవీ వీడియోస్‌ని యూట్యూబ్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని స్టేటస్‌లు పెడుతూ నా ఫ్రెండ్స్‌ని సతాయిస్తుంటా. అతడంటే అంత పిచ్చి నాకు. ప్రపంచకప్‌లో తన సత్తాను చాటి నాలాంటి ఫ్యాన్స్‌కు మజా ఇస్తాడనుకున్నా. కానీ యూవీ రిటైర్మెంట్‌ ప్రకటనతో షాకయ్యా.– రాగిణి కుమారి, యూవీ ఫ్యాన్‌  

 చాలా బాధగా ఉంది
నేనూ యూవీ ఫ్రెండ్స్‌. నేను క్రికెట్‌ కోసం చండీగఢ్‌ ఇండియా క్యాంప్‌లో ఉన్నప్పుడు అక్కడకి యూవీ వాళ్ల నాన్నతో కలసి వచ్చేవాడు. మంచి మనసున్న వ్యక్తి. తక్కువ సమయంలో మేమిద్దరం మిత్రులయ్యాం. ఆ టైంలో హైదరాబాద్‌ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకునేవాడు. క్రికెట్‌పై యూవీకి ఉన్న పట్టుదల, ప్రేమ ప్రత్యేకం. ఇప్పుడు ప్రపంచకప్‌ పొటీల్లో నా ఫ్రెండ్‌ లేకపోవడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది.– శ్రీకాంత్, యూవీ ఫ్రెండ్, క్రికెటర్‌  

లెఫ్ట్‌హ్యాండ్‌ నేర్చుకున్నా
చిన్నప్పటి నుంచి యూవీ ఆట చూసి పెరిగాను. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌గా అతడు కొట్టే షాట్స్‌కి నేను ఫిదా. అందుకే ఆయనలా ఆడాలని నేను కూడా లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటింగ్‌ నేర్చుకున్నాను. కొన్ని సందర్భాల్లో నేను కొట్టే షాట్స్‌ యూవీలా ఉన్నాయంటూ మా ఫ్రెండ్స్‌ అంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడే రిటైర్‌ అవ్వకుండా వరల్డ్‌కప్‌ ఆడితే బాగుండేది.– చార్లెస్, లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌

ఆటగాడు... అందగాడు
యువరాజ్‌ మంచి ఆటగాడే కాదు.. అందగాడు కూడా. అతను సిటీకి వచ్చినప్పుడల్లా కలవాలనే ప్రయత్నించేదాన్ని కానీ కుదరలేదు. వన్డే, టెస్ట్, ఐపీఎల్‌ ఏదైనా సరే.. యూవీ బ్యాటింగ్‌కు దిగాడంటే చాలు టీవీ ముందు నుంచి కదలను. అంతమంచి ఆటగాడి ఆటను ప్రపంచకప్‌ పోటీల్లో చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది.– సాహితి, యూవీ అభిమాని

కేన్సర్‌ రోగుల కోసం..
యూవీకి హైదరాబాద్‌ అంటే ఎంతో ఇష్టం. కేన్సర్‌ రోగులకు సాయం చేసేందుకు తాను స్వయంగా ‘యూవీ కెన్‌’ అనే పేరుతో ఓ స్పోర్ట్స్‌ స్టోర్‌ను పంజగుట్టలోని సెంట్రల్‌ మాల్‌లో 2018లో ప్రారంభించారు. క్రీడా పరికరాలు, దుస్తులు వంటి వాటిని అమ్మి తద్వారా వచ్చిన డబ్బును కేన్సర్‌ పేషెంట్లకు ఇస్తున్నట్లు దాని ప్రారంభోత్సవంలో యూవీ చెప్పడం ఎవరూ మరిచిపోలేదు. 

>
మరిన్ని వార్తలు