త్వరలో బదిలీలు.!

13 Jun, 2019 09:10 IST|Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: ఏ ఎన్నికలు జరిగిన ప్రభుత్వ అధికారుల బదిలీ అనేది సాధారణం. ఎన్నికల్లో కీలకంగా వ్యవహారించే వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులతో పాటు డివిజన్, జిల్లా అధికారులకు కూడా బదిలీలు చేపడుతుంటారు. ముఖ్యంగా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే రెవెన్యూ శాఖలో పని చేసే అధికారుల బదిలీలు తప్పకుండా జరుగుతాయి. జిల్లాలోని వివిధ చోట్ల ఒకేచోట మూడేళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్న అధికారులకు ఈ బదిలీలు తప్పకుండా వర్తిస్తాయి. ఈసారి వరుసగా ఎన్నికలు రావడంతో మూడేళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారితో పాటు అందరినీ బదిలీ చేశారు. ఈ లెక్కన గతేడాది అక్టోబర్‌లో జిల్లాలోని 19మంది తహసీల్దార్లకు స్థాన చలనం కలిగింది. ఎన్నికలకు ముందు బదిలీ అయిన వారందరూ ఇతర జిల్లాలకు వెళ్లగా, ఇతర జిల్లాల తహసీల్దార్లు మన జిల్లాకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు  ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై దృష్టి సారించింది. ఎన్నికలకు ముందు బదిలీ అయినా తహసీల్దార్లను వారి వారి జిల్లాలకు పంపాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో వీరి బదిలీలు చేపట్టేందుకు చర్యలు తీసుకోనుంది. మరో వారం రో జుల్లో తహసీల్దార్ల బదిలీలు చేపట్టి ఈ నెలా ఖరులోగా ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.

జిల్లాకు రానున్న మన తహసీల్దార్లు.. 
ఎన్నికల్లో చేపట్టే సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల్లో తహసీల్దార్లుగా పని చేస్తున్న 19మంది అధికారులను చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) బదిలీ చేసింది. బదిలీలకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులకు అప్పట్లో పంపించింది. దీంతో పాటు ఇతర జిల్లాల తహసీల్దార్లను మన జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ లెక్కన మన జిల్లాకు 18 మంది వేరే జిల్లాల్లో పని చేసే తహసీల్దార్లు కేటాయించింది. మన జిల్లాకు వచ్చిన వారిలో కుమ్రం భీం జిల్లా నుంచి ముగ్గురు తహసీల్దార్లు, వరంగల్‌ అర్బన్, నిర్మల్‌ నుంచి ఒక్కొక్కరు ఉండగా, జగిత్యాల నుంచి 13 మంది వచ్చారు. మన జిల్లాలో పని చేసిన వివిధ మండలాల తహసీల్దార్లు నిర్మల్‌కు పది మంది వెళ్లగా, కుమురంభీం జిల్లాకు ఐదుగురు, భద్రాద్రి కొత్తగూడెంకు ఇద్దరు, వరంగల్‌ అర్బన్, కరీంనగర్‌కు ఒక్కొక్కరు చొప్పున వెళ్లారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసినందున ఇప్పుడు వీరందరు తిరిగి జిల్లాకు రానున్నారు. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్‌ ఆయా మండలాల తహసీల్దార్లుగా బాధ్యతలు అప్పగించనున్నారు.

ఎన్నికల్లో తహసీల్దార్లదే ముఖ్యపాత్ర...
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా మన జిల్లాలో పని చేసిన తహసీల్దార్లను ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ జిల్లాలకు బదిలీ చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా వరంగల్, కరీంనగర్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికలకు ముందు కొత్త జిల్లా యూనిట్‌గా తీసుకొని బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ తహసీల్దార్లుగా పని చేసిన వారు బదిలీపై మన జిల్లాకు, మన దగ్గర పని చేసిన వారు ఆయా జిల్లాలకు వెళ్లారు. మన జిల్లా నుంచి తహసీల్దార్లు ఇతర జిల్లాలకు వెళ్లి నేటికి 241 రోజులు అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచి గెలుపోటములు తేలే వరకు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలయ్యేం త వరకు అక్కడే విధులు నిర్వర్తించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తహసీల్దార్లు సహాయ రిటర్నింగ్, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడంతో వీరి బదిలీలు తప్పకుండా చేపడుతారు.

మరిన్ని వార్తలు