తెరపైకి సాగునీటి ఎన్నికలు

7 Oct, 2019 04:58 IST|Sakshi

ప్రస్తుత కాల్వలకు తోడు కొత్త ప్రాజెక్టుల కింద భారీగా నిర్మాణం

సంఘాలు ఉంటేనే నీటి వినియోగం, పంపిణీ, నిర్వహణ సాధ్యమనే యోచన

ఇంజనీర్ల స్థాయిలో ఇప్పటికే చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద కోటి ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నీటి పారుదల వ్యవస్థ యాజమాన్యంలో రైతులకు భాగస్వామ్యం కల్పించే చర్యలు చేపట్టాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటం, వాటి కింద నిర్మిస్తున్న కాల్వల ద్వారా సాగునీటిని అందిస్తున్న పరిస్థితుల్లో నీటి పారుదల వ్యవస్థ సక్రమ నిర్వహణ, సమర్ధ నీటి పంపిణీకి సాగునీటి సంఘాలను పునర్‌వ్యవస్థీకరించాలని యోచిస్తోంది. ఈ వ్యవస్థల సమగ్ర అభివృధ్ధికి వీలుగా ఈ సంఘాలకు గతంలోమాదిరి ఎన్నికలు నిర్వహించడమా లేక గ్రామ కమిటీలను నియమించడమా లేక లాటరీ పద్ధతిన ఉత్సాహవంతులను ఎంపికచేయడమా? అన్న అంశాలను పరిశీలిస్తోంది.

2014 వరకే పనిచేసిన సంఘాలు..
సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి వినియోగదారులను సంఘటిత పరచడం, నీటి యాజమాన్యంలో రైతులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా 1997లో అప్పటి ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసింది. సాగునీటి వినియోగ సంఘాలు (డబ్ల్యూయూఏ), డిస్ట్రిబ్యూటరీ సంఘాలు(డీసీ), ప్రాజెక్టు కమిటీ(పీసీ)లను ఏర్పాటు చేసింది. 2014కు ముందు తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో మేజర్‌ ప్రాజెక్టుల కింద నీటి వినియోగ సంఘాలు 744, డీసీలు 97, పీసీలు 8 వరకు ఉండేవి. ఇక మైనర్‌ కింద 3,876 వరకు నీటి సంఘాలు ఉండేవి. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటి ఎన్నికల్లో మార్పులు చేసింది. రొటేషన్‌లో ఈ సంఘాల కార్యవర్గాలు పనిచేసేలా చర్యలు తీసుకుంది. ప్రతి రెండేళ్లకోమారు మూడో వంతు సభ్యులకు ఎన్నికలు జరిపి రెండేళ్ల పదవీకాలం ముగిసే సభ్యులను మాజీలు చేయాలని సూచించింది. ఈ పద్ధతిలో 2006, 2008 సంవత్సరాల్లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంఘాలే 2014 జనవరి వరకు ఉన్నా, తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సైతం రైతు సంఘాల జోలికి వెళ్లలేదు.

మరిన్ని వార్తలు