లోక్‌సభ ఓటర్లు 3 కోట్లు!

14 Mar, 2019 02:17 IST|Sakshi

2.95 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య

కొత్త ఓటర్లకు చోటు కల్పిస్తే 3 కోట్లకు చేరే చాన్స్‌

రేపటివరకు ఓటరు నమోదుకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో సుమారు 3 కోట్ల మందికి ఓటు హక్కు లభించనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2019లో భాగంగా గత నెల 22న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,95,18,964 మంది ఓటర్లున్నారు. అందులో 1,48,42,619 మంది పురుషులు, 1,46,74,977 మంది మహిళలు, 1,368 మంది ఇతరులున్నారు.

ఓటరు నమోదు కోసం ఈ నెల 15 వరకు వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులతో పాటు పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్‌ఓలను నియమించి ఓటరు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లోక్‌సభ ఎన్నికలకు వారం రోజుల ముందు అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. అనుబంధ ఓటర్ల జాబితాలో మరో 5 లక్షల మంది కొత్త ఓటర్లకు చోటు లభిస్తే రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య తొలిసారిగా 3 కోట్ల మైలురాయిని దాటనుంది.
 
మల్కాజ్‌గిరి టాప్‌! 
మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో అత్యధికంగా 30,98,816 మంది ఓటర్లున్నారు. 24,15,598 ఓటర్లతో చేవెళ్ల, 19,59,490 మంది ఓటర్లతో హైదరాబాద్, 19,54,813 మంది ఓటర్లతో సికింద్రాబాద్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహబూబాబాద్‌ పరిధిలో అతి తక్కువగా 14,14,210 మంది ఓటర్లున్నారు.

మరిన్ని వార్తలు