నేతల భవిత భద్రం!

15 Apr, 2019 07:02 IST|Sakshi
జేపీఎన్‌సీఈ కళాశాలలోని స్ట్రాంగ్‌రూంల వద్ద ఏర్పాటు చేసిన భద్రత   

మహబూబ్‌నగర్‌ క్రైం: పార్లమెంట్‌ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ తీర్పు తెలపగా.. ఈవీఎంలలో నేతల భవిత భద్రంగా ఉంది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి 12మంది అభ్యర్థులు బరిలో ఉండటం తెలిసిన విషయమే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలన్నింటినీ ఇప్పుడు జిల్లా కేంద్రంలోని జేపీఎన్‌సీఈ కళాశాల భవనాల్లో ఉంచారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఈవీంలు, వీవీప్యాట్లు స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. ఇక అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్‌ రూముల్లో దాగి ఉంది. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అంటే సరిగ్గా 38రోజుల సమయం ఉంది. ఇన్ని రోజులు అభ్యర్థులు ఓపిక పట్టక తస్పదు. ఇప్పుడు అందరి చూపు జేపీఎన్‌ఈఎస్‌ కళాశాల వైపే ఉంది.

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు
మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. భవనంలోని కింది అంతస్తులో మూడు నియోజకవర్గాల స్ట్రాంగ్‌ రూంలు, పైన అంతస్తులో నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్‌ రూంలు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్‌ రూం, ఒక ఓట్ల లెక్కింపు గదిని ఏర్పాటు చేశారు. అధికారులు, అభ్యర్థులు కూర్చునేందుకు, అలాగే మీడియా పాయింట్‌కు వేర్వేరు గదులను కేటాయించారు.

నిఘా నేత్రాలతో పర్యవేక్షణ
భవనం లోపల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూంలో ఇతర విలువైన ఎన్నికల సామాగ్రి ఉన్నందున నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల్లోని స్ట్రాంగ్‌ రూంలు, గదులు తలుపులకు, హాళ్లలో, విధులు నిర్వహించే పోలీసుల గదుల వద్ద, భవనం, బయట కెమెరాలు బిగించారు. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన గదులు, హాల్‌లో కనీసం కలిపి దాదాపు 30వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భవనం బయట, లోపల అన్ని గదులు సీసీ కెమెరాల నిఘా నేత్రంలో నిక్షిప్తమవుతున్నాయి. బందోబస్తు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండేందుకు ఇవి దోహదపడటమే కాకుండా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పని చేస్తాయి. భవనం లోపల, పైన ఆరుబయట ప్రాంగణం మొత్తంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు.

పారామిలటరీ పోలీసుల ఆధీనంలో..
జేపీఎన్‌ఈఎస్‌ భవనాన్ని సీఆర్‌పీఎఫ్‌(సెంట్రల్‌ రిజర్వ్‌ ఫోర్స్‌), పారామిలటరీ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 40మంది సీఆర్‌పీఎఫ్, 20మంది జిల్లా పోలీసులు నిత్యం ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భవనం లోపల పారామిలటరీ పోలీసులే ఉంటారు. సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపరు. జిల్లా లోకల్‌ పోలీసులను కూడా లోనికి అనుమతించారు.

స్ట్రాంగ్‌ రూంల వద్ద బందోబస్తు నిర్వహించే సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేసి డ్యూటీ వేస్తారు. భవనం లోనికి  వెళ్లే ప్రధాన ద్వారంతో పాటు పక్కన, వెనుక ఉన్న గేట్ల వద్ద బందోబస్తు పెట్టారు. ఉన్నతాధికారుల అనుమతితో పని నిమిత్తమై వచ్చే ఆర్వో, ఏఆర్వోలను అప్పుడప్పుడూ  అధికారులకు లోపలికి వెళ్లడానికి మాత్రం అవకాశం కల్పిస్తారు. అలాగే భవనం చుట్టూ పోలీసులు పికెటింగ్‌లు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. భవనం వద్ద బందోబస్తుపై లోకల్‌ పోలీసులకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచనలు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ ప్రాంగణంలోనికి రానివ్వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు