పరి‘శ్రమ’ ఫలించింది!

2 May, 2017 01:50 IST|Sakshi
పరి‘శ్రమ’ ఫలించింది!

భారీ పరిశ్రమల ఆసక్తిలో.. మూడో స్థానంలో తెలంగాణ
- రూ.7,268 కోట్ల పెట్టుబడితో 43 పరిశ్రమల స్థాపనకు ఆసక్తి వ్యక్తీకరణ
- 2016-17 వార్షిక నివేదికలో వెల్లడించిన డీఐపీపీ

సాక్షి, హైదరాబాద్‌: భారీ పరిశ్రమల స్థాపన కోసం 2016–17 సంవత్సరానికిగాను పెట్టుబడిదారుల ఆసక్తి వ్యక్తీకరణలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో రూ.7,268 కోట్ల పెట్టుబ డులతో 43 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకాల శాఖ (డీఐపీపీ)కి ఇండస్ట్రియల్‌ ఇంటప్రెన్యూర్‌ మెమో రాండం(ఐఈఎం), లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ)లు దాఖలు చేశారు.

డీఐపీపీ రాష్ట్రాల వారీగా భారీ పరిశ్రమల స్థాపనకు నమోదైన ఆసక్తి వ్యక్తీకరణల వివరాలను వార్షిక నివేదిక రూపంలో తమ వెబ్‌పోర్టల్‌లో పెట్టింది. ఆ నివేదిక ప్రకారం.. 2014–15లో తెలంగాణ రూ.10,209 కోట్ల పెట్టుబడుల ఆసక్తి వ్యక్తీకరణతో జాతీయ స్థాయిలో 10వ స్థానంలో నిలిచింది. 2015–16లో రూ.22,146 కోట్ల ఆసక్తి వ్యక్తీరణతో దేశంలో 6వ స్థానంలో.. గతేడాది రూ.7,268 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రం ఏపీ గతేడాది రూ.2,223 కోట్ల పెట్టుబడులతో 33 భారీ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి వ్యక్తమై.. ఆరో స్థానంలో నిలిచింది.

అగ్రస్థానంలో గుజరాత్‌
భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణలో గుజరాత్‌ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో రూ.31,367 కోట్ల పెట్టుబడులతో 98 పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ దరఖాస్తులు వచ్చాయి. ఇక రెండో స్థానంలో నిలిచిన కర్ణాటకలో రూ.22,868 కోట్ల పెట్టుబడులతో 92 భారీ పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వచ్చాయి. మూడో స్థానంలో తెలంగాణ నిలవగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్ర దేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌ నిలిచాయి.

పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
రూ.10 కోట్లు, ఆపై పెట్టుబడులతో ఏర్పాటు చేసే పరిశ్రమలను భారీ పరిశ్రమల కింద పరిగణిస్తారు. ఈ పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం ఆసక్తి వ్యక్తీకరిస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు డీఐపీపీకి మెమోరండం/ఎల్‌ఓఐలు దాఖలు చేస్తారు. ఈ దరఖాస్తుల ఆధారంగానే తాజాగా> డీఐపీపీ వార్షిక నివేదికను విడుదల చేసింది. డీఐపీపీకి ఆసక్తి వ్యక్తీకరణ చేసినవారిలో తర్వాత కొందరు విరమించుకునే అవకాశముందని.. మిగతా వారు పరిశ్రమలు స్థాపిస్తారని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు