రాష్ట్రంలో వైనరీ కోసం కసరత్తు

4 May, 2018 00:54 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో వైన్‌కు పెరుగుతోన్న డిమాండ్‌

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి

రాష్ట్రంలో రోజుకు 30 వేల కేసులు, ఆంధ్రలో 20 వేల కేసుల వినియోగం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో వైన్‌ కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల్లో వైన్‌కు డిమాండ్‌ పెరుగుతుండటం, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ద్రాక్ష తోటల పెంపకానికి అనుకూల వాతావరణం ఉండటం తదితర అనుకూలతల దృష్ట్యా టీఎస్‌బీసీఎల్‌ వైన్‌ షాపుల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది. కొత్తగా మద్యానికి అలవాటు పడుతున్న యువతలో 70% మంది వైన్‌ వైపే మొగ్గు చూపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నెలకు 50 వేల కేసుల వైన్‌ లాగేస్తున్నారు. మన దగ్గర చెప్పుకోదగిన స్థాయి వైనరీ లేకపోవటంతో వైన్‌ కోసం  బయటి రాష్ట్రాల మీదనే ఆధారపడాల్సి వస్తోం ది.

మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి రోజుకు వైన్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందులో 70% మార్కెట్‌ను ఓ జాతీయ స్థాయి వైన్‌ కంపెనీ ఆక్రమించింది. తాజాగా టీఎస్‌బీసీఎల్‌ చైర్మన్‌ ఇదే కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ కంపెనీ ఆధ్వర్యంలో పెంచుతున్న ద్రాక్ష తోటలను సందర్శించారు. వైనరీ ప్లాంటు తో ఎంత మంది యువతకు ఉపాధి లభిస్తోంది ..మార్కెటింగ్‌ తీరు ఎలా ఉంది వంటి అంశాలను అధ్యయనం చేశారు. తెలంగాణలో రోజు కు 30 వేల కేసు లు, ఏపీలో రోజుకు 20 వేల కేసుల చొప్పు న వైన్‌ను తాగుతున్నారని ఎక్సైజ్‌ శాఖ  అంచనా వేస్తోంది.

రైతులకు, యువతకు మేలు కలిగేలా.. 
ఒకప్పుడు హైదరాబాద్‌ ద్రాక్ష తోటలకు నిలయం. నగరం చుట్టూ ద్రాక్ష తోటలే విస్తరించి ఉండేవి. నగర ఆధునీకరణ, రైతాంగం పత్తి ప ట్ల ఆసక్తి చూపడం వంటి కారణాలతో ద్రాక్ష సాగు కనుమరుగైపోయింది. వైన్‌ పరిశ్రమ ఏర్పాటుతో నగరం చుట్టూ ఉన్న మేడ్చల్, యాదాద్రి, శంషాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలకు చెందిన రైతాంగాన్ని పత్తి సాగు నుంచి ద్రాక్ష తోటల పెంపకం వైపు మళ్లించవచ్చు. యువతకు కూడా ఉపాధి కల్పించవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

రాష్ట్రంలో వైన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది
యువత ఎక్కువగా వైన్‌ పట్ల ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో వైన్‌ పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంది. ఓ జాతీయ స్థాయి వైన్‌ కంపెనీలో వైన్‌ తయారీ, ద్రాక్ష తోటల పెంపకం, మార్కెటింగ్‌ విధానం అధ్యయనం చేశాను. 
    – దేవీప్రసాద్, టీఎస్‌బీసీఎల్‌ చైర్మన్‌ 

>
మరిన్ని వార్తలు