వచ్చే వారం నుంచి తీవ్ర వడగాడ్పులు

25 Apr, 2018 01:36 IST|Sakshi

జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు సూచనలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. వచ్చే వారం నుంచి ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇకనుంచి పలుచోట్ల 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంటుందని వెల్లడించింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. వడగాడ్పుల తీవ్రత పెరిగితే సాధారణం కంటే ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పలు సూచనలు చేసింది. తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం, చర్మం పొడిబారడం, మత్తు నిద్ర, వాంతులు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి కలిగి ఉండటం వంటివి వడదెబ్బ లక్షణాలుగా వివరించింది. 

చేయకూడని పనులు.. 

అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. 
ఎండవేడిలో ఎక్కువ సేపు పనిచేయకూడదు. మధ్యమధ్యలో చల్లని ప్రదేశంలో సేద తీరుతూ ఉండాలి. 
తగిన జాగ్రత్తల్లేని నిల్వ ఉంచిన ఆహారం అధిక వేడితో చెడిపోతాయి. వాటిని తినొద్దు. తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదముంది. 
వడదెబ్బ తగిలిన వారిని వేడి నీటిలో తడిపిన గుడ్డతో తుడవకూడదు. 
వడదెబ్బ తగిలిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేయకూడదు. 

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
తరచూ నీరు తాగుతూ బయటకు వెళ్లేటప్పుడు మంచినీరు తీసుకెళ్లాలి. 
నిమ్మరసం, కొబ్బరినీళ్లు వంటివి తాగుతూ ఉండాలి. 
తెలుపు లేదా లేత వర్ణం కలిగిన పలుచటి కాటన్‌ వస్త్రాలు ధరించాలి. 
తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. 
పలుచటి మజ్జిగ, గ్లూకోజ్‌ నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని ఇంటిలోనే తయారుచేసిన ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. 
వడదెబ్బ తగిలిన వారిని చల్లని నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. 
శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. 
చంటి పిల్లలు, గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, వడగాడ్పులకు గురికాకుండా కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 
వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు