నిప్పుల కుంపటి 

22 May, 2019 10:03 IST|Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: ఎండలు మండిపోతున్నాయి. భూమి సెగలు కక్కుతోంది. వేడి గాలులు దడ పుట్టిస్తున్నాయి. ఉక్కపోత చెమటలు పట్టిస్తోంది. భిన్నమైన వాతావరణానికి నెలవైన ఆదిలాబాద్‌ జిల్లాలో భానుడు నిప్పుల సెగలు కక్కుతున్నాడు. గతేడాది కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి ఎండలు విఫరీతంగా పెరిగాయి. మంగళవారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. అయితే అనధికారికంగా దాదాపు 47 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలు స్తోంది. గతేడాది మే గరిష్ట ఉష్ణోగ్రత 44.5 ఉష్ణోగ్రత నమోదైంది. వేడి ఉష్ణోగ్రత భరించలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 10గంటలు దాటిందంటే ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి ఎదురవుతోంది.

ఎండల బారి నుంచి రక్షణ పొందాలంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వర్షాకాలంలో  ఎక్కువ వర్షాలు కురిస్తే, చలికాలంలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అలాగే వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో జిల్లావాసులు మూడు కాలాల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే. వేసవి వేడిని భరించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారి కూలీ పనిచేసుకొని జీవించే వారు, వివిధ ఉద్యోగాల విధి నిర్వహణలో భాగంగా గ్రామాల్లో తిరిగే వారితోపాటు వివిధ వృత్తుల్లో నిమగ్నమైన వారు వేసవి తాపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వడదెబ్బకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. వృద్ధులు, మద్యం సేవించేవారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది.
 
వడదెబ్బతో జాగ్రత్త..
ఎండల ప్రభావంతో ఏటా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఆదిలాబాద్‌ ఉమ్మడి జి ల్లాలో దాదాపు పదుల సంఖ్యలో చనిపోయారు. గతేడాది దాదాపు 50 మంది వరకు మరణించారు. ఎండలో పనిచేసే వారు, తిరిగే వారు త్వరగా వడదెబ్బకు గురవుతాయి. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారన్‌హిట్‌ దాటితే వడదెబ్బకు గుర య్యే ప్రమాదం ఉంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావ డం, ఫిట్స్‌ రావడం తదితర లక్షణాలు బయట పడతాయి. ఒక్కోసారి కోమలోకి సైతం వెళ్లవచ్చు. శరీరంలో ప్రొటీన్‌ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. శరీర ఉష్ణోగ్రతలు మామూలు స్థితిలో ఉండేలా చూసుకో వాలి. జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలవుతున్నారు. తీ వ్రమైన జ్వరం, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చి న్నారులకు వేడి గాలి తగిలినా వడదెబ్బకు గుర య్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వదులైన కాటన్‌ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీటిని అధికంగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. చలువైన వస్తువులు వాడాలి. నీటిని తాగుతూ ఉండాలి. ఏ సమయంలోనైనా అజాగ్రత్త వహించకుండా బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు నీటిని వెంట తీసుకెళ్లాలి. వేడి ప్రదేశాల వద్ద పనిచేసే వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. వడదెబ్బకు గురైన వ్యక్తిపై ఉన్న దుస్తులు తొలగించి చల్లని గుడ్డతో తుడవాలి. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి.

కూలీలు భద్రం..
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. కూలీలు పనిచేసే సమయంలో జాగ్రత్త పడాలి. తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలి. ఎండ నుంచి కూలీలకు రక్షణ కల్పించాలి. వీరితో పాటు భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలతోపాటు ఇతర పనులు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

చల్లని పానీయాలకు పెరిగిన గిరాకీ..
ప్రజలు ఎండల తీవ్రతకు అల్లాడి పోతున్నారు. వేడి తీవ్రత నుంచి ఉపశమనానికి కొబ్బరినీళ్లు, ఖర్బుజా, పండ్ల రసాలు, ఇతర పానీయాలు తాగుతున్నారు. ఎండలు మండుతుండడంతో ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో కూల్‌డ్రింక్‌ షాపులు, జ్యూస్‌ సెంటర్లు వెలిశాయి. ఎండలో తిరిగే వాహనదారులు, కార్యాలయాల్లో పనిచేసే వారు, ఫీల్డ్‌ వర్క్‌ చేసేవారు వేడిని తట్టుకోలేక కాసేపు సేదతీరి వాటి రుచిని ఆస్వాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు