నానాయాగి చేస్తున్న చంద్రబాబు

22 May, 2019 10:03 IST|Sakshi
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య

సాక్షి, చీమకుర్తి : రాష్ట్రంలోని పీడీఎఫ్‌ ఖాతాల్లో రూ.54 వేల కోట్లు శుభ్రంగా డ్రా చేసుకున్నారు. పట్టిసీమ పేరుతో రూ.1800 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక పోలవరం సంగతి సరేసరి. ఇలా రాష్ట్రంలోని నిధులను ఐదేళ్లపాటు అధికారకంగా మెక్కేసిన చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తిరిగి నానాయాగీ చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌లో స్పష్టంగా వైఎస్సార్‌సీపీ తరఫున జగన్‌ సీఎం కావడం ఖాయమని తెలిసి పోయింది కాబట్టే చంద్రబాబు తన ఓటమిని జీర్ణించుకోలేక దేశంలోని పలు ప్రాంతాల్లో కాటికి కాళ్లుచాపిన నాయకులను కలుసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నకలను హుందాతనంగా స్వీకరించాలే తప్ప చంద్రబాబు ఓడిపోతుంటే తన స్థాయి తక్కువ చేసుకుని ప్రవర్తించటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చురకలు వేశారు. 
నాడు బాగున్న ఈవీఎంలు, నేడు ఎందుకు బాగాలేవు
2014లో చంద్రబాబు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నట్లా..? అదే ఈవీఎం నేడు ఎందుకు బాగులేవు...? చంద్రబాబు ఓడిపోతున్నాడు కాబట్టేగా ఆ భయం. ఈవీఎంలనే మేనేజ్‌ చేసే అవకాశం ఉంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీనే గెలిపించుకునేవాళ్లం కదా. నిన్న, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ ఎందుకు ఓడిపోయేదంటూ ఈవీఎంలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
విశ్వసనీయత లేని బాబు
ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. కానీ చంద్రబాబు ఇంట ఓడిపోబోతున్నాడు కానీ రచ్చ మాత్రం రచ్చరచ్చ చేస్తున్నాడు. చంద్రబాబు ప్రవర్తన చూస్తూ అధికార పక్షమూ ఆయనే వ్యవహరిస్తున్నాడు. ప్రతిపక్ష బాధ్యతలను ఆయనే నెరవేరుస్తున్నాడు. ఇలా ద్వంద్వ విధాలను అవలంభిస్తుండడం వలనే మొట్ట మొదటి నుంచి ప్రత్యేక హోదా నుంచి ఇప్పుడు ఈవీఎంల వరకు ఆయన మాట్లాడిన మాటల్లో విశ్వసనీయతను కోల్పోయాడు కాబట్టే ఆయనను ప్రజలు పక్కన పెట్టబోతున్నారని సాంబయ్య చెప్పారు. 
మోడీని కించపరచడం దారుణం
ప్రధాని మోడీ కంటే తానే సీనియర్‌నని చంద్రబాబు చెప్పుకుంటాడు. కలెక్టర్‌ కంటే తహశీల్దార్‌ సీనియర్‌ అయి ఉంటాడు. అంతమాత్రం చేత తహశీల్దార్‌ చెప్పినట్లు కలెక్టర్‌ వినాలా..? కలెక్టర్‌ చెప్పినట్లు తహశీల్దార్‌ వినాలా..? ఆర్డర్‌ ఆఫ్‌ ప్రోటోకాల్‌ పాటించకుండా మోడీని కించపరచటం, దారుణంగా మాట్లాడటం కూడా ప్రజల్లో చంద్రబాబు ప్రవర్తనా తీరుపైప్రజలు విసుగెత్తిపోయారని సాంబయ్య స్పష్టం చేశారు. 
జగన్‌ సీఎం కావడం ఖాయం
రేపు మే నెల 23న రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ గెలిచి జగన్‌ సీఎం కావడం ఖాయం. కేంద్రంలో మోడీ తిరిగి ప్రధాని కావడం ఖాయమన్నారు. ఏప్రిల్‌ నెల 11న ఫ్యాన్‌కే పట్టాభిషేకం అని తాను చెప్పిన జోస్యం నిజం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి 130 సీట్లుకు తగ్గకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. లగడపాటి  సర్వేలో హేతుబద్దత లేదని, ఆయన సర్వే ఏదో ఒక పార్టీకి మేలు చేయాలనే లక్ష్యంతో చెప్పినట్లుగా ఉందే తప్ప అది సర్వే కాదు. సర్వేలో ప్రజల అభిప్రాయాలు ప్రతిబింభించాలే తప్ప ఎవరికో లబ్ధి చేకూర్చేలా ఉండే వాటిని సర్వేలని చెప్పడం సమంజసం కాదని లగడపాటి సర్వేను కొట్టిపారేశారు. 

మరిన్ని వార్తలు