మానేరు.. కనరు.. వినరు!

24 Apr, 2018 01:39 IST|Sakshi
కొదురుపాకలో ఓ గుడిసెలో ఉంటున్న నిర్వాసితుడు భూమయ్య

     నిర్వాసితులకు గాసం లేదు.. ఆవాసం లేదు

     పదేళ్లయినా కొలిక్కిరాని పునరావాసం

     సమస్యల వలయంలో కాలనీలు

     నీళ్ల కోసం జనం అరిగోస

     కానరాని బస్‌షెల్టర్లు, దోబీఘాట్లు

     యువతకు పరిహారంలోనూ మొండిచేయి

సాక్షి, హైదరాబాద్‌: ఏళ్లు గడుస్తున్నా మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల వెతలు తీరడం లేదు. ఓవైపు ఈ ప్రాజెక్టును ఆరంభించేందుకు కసరత్తు జరుగుతున్నా.. మరోవైపు దశాబ్దానికి పైగా పరిహారం అందక నిర్వాసితులు గుండెలు బాదుకుంటున్నారు. పదేళ్ల కిందట మొదలుపెట్టిన సహాయ, పునరావాస ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. పునరావాస కాలనీల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. పట్టాల పంపిణీ మొదలు గృహ వసతి కల్పన వరకు స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం నిర్వాసితుల పాలిట శాపంగా మారింది. 

పూర్తికాని ఇళ్లు, రోడ్లు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25.87 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టును 2006 అక్టోబర్‌లో చేపట్టారు. 2009 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని సంకల్పించినా 12 ఏళ్ల అనంతరం పనులు ప్రస్తుతం చివరి దశకు చేరాయి. ప్రాజెక్టు 25 గేట్లు బిగింపు ప్రక్రియ పూర్తయి, నీటి నిల్వకు సిద్ధమైంది. అయితే పన్నెండేళ్ల కింద మొదలైన పునరావాస ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు కింద బోయినపల్లి మండలంలో కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, తంగళ్లపల్లి మండలంలో చీర్లవంచ, చింతల్‌ఠానా, వేములవాడ రూరల్‌ మండలంలో అనుపురం, రుద్రవరం, కొడుముంజ, సంకెపల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల్లో 11,731 కుటుంబాలు నిర్వాసితులవుతున్నట్లు 2008లో గెజిట్‌ జాబితా ప్రచురించారు.

ఇప్పటికీ పలు ముంపు గ్రామాల్లో పూర్తిగా పరిహారం అందలేదు. గెజిట్‌ పబ్లికేషన్‌ సమయంలో తప్పిపోయిన వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి ఇంకా చెప్పులరిగేలా తిరుగుతున్నారు. గెజిట్‌లో దొర్లిన తప్పులు సవరించుకోవడానికి కూడా నానా తిప్పలు పడుతున్నారు. మొత్తం 13 పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి 4,500 ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా.. వెయ్యి మాత్రమే పూర్తి చేశారు. పునరావాస కాలనీల్లో రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి కనీస వసతులు కల్పించాలని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం అధికారులను ఆదేశించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. 

కాలనీల్లో వసతులేవి?
నిర్వాసితులు రాక ముందే పలు పునరావాస కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. ఇళ్ల నిర్మాణ సమయంలోనే చాలాచోట్ల మురుగు కాల్వలు మట్టి, ఇసుక, ఇటుక తదితరాలతో పూడుకుపోయాయి. దీంతో కాలనీల్లో పారిశుధ్యం లోపించి దోమల బెడద తీవ్రంగా ఉందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలనీల్లో శ్మశాన వాటికలు లేకపోవడంతో అంత్యక్రియలకు  ఇబ్బంది ఎదురవుతోంది. కొదురుపాక, నీలోజిపల్లి కాలనీల్లో ఎవరైనా చనిపోతే మిడ్‌మానేరు కట్ట కింద అంత్యక్రియలు చేస్తున్నారు. కాలనీల పరిసరాల్లో బస్సులు నిలపడం లేదు.

బస్‌షెల్టర్ల జాడే లేదు. ముంపు గ్రామాల్లో చెరువులు, కుంటల్లో రజకులు బట్టలు ఉతికి పొట్టబోసుకునేవారు. కొత్త కాలనీల్లో చెరువులు, కుంటలు లేకపోవడంతో వారి ఉపాధికి గండి పడింది. కాలనీలో దోబీఘాట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక కాలనీల్లో నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కోట్లు ఖర్చు చేసి రక్షిత మంచినీటి పథకాలు నిర్మించినా.. అధికారుల సమన్వయ లోపంతో  ప్రజలకు నీటి వసతి అందడం లేదు. కొదురుపాక, నీలోజిపల్లి కాలనీల్లో రూ.80 లక్షల అంచనాలతో నీటి పథకాలు నిర్మించి, ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చినా నీటి సరఫరా జరగడం లేదు. 

గెజిట్‌లో పేరు లేదని పరిహారం ఇవ్వలేదు
నేను కుట్టు మిషన్‌ ద్వారా జీవనోపాధి పొందుతా. నాపేరు గెజిట్‌లో లేకపోవడంతో ఇప్పటి వరకు పైసా పరిహారం ఇవ్వలేదు. నాకు నలుగురు కుమారులు. ఇందులో ముగ్గురు పరిహారానికి అర్హులు. ఎవ్వరికి పరిహారం, పట్టా, ప్యాకేజీ రాలేదు. ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదు.     
– దోమకొండ రాజవీరు, కొదురుపాక

ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించాలి
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో వేల మంది నిర్వాసితులు అప్పులు తెచ్చి రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకున్నారు. ఆరు నెలల క్రితం పీఎంఈవై పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.1.20 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఇవ్వడం లేదు. ఇళ్లు పూర్తి చేసిన వారికి వెంటనే బిల్లులు విడుదల చేయాలి.     
– కూస రవీందర్, నీలోజిపల్లి

యువతకు పరిహారం..పరిహాసం
మిడ్‌మానేరు ముంపునకు గురైన గ్రామాల్లోని యువతకు రూ.2 లక్షల పరిహారం అందించేందుకు ప్రభుత్వం 2015 మార్చిలో జీవో జారీ చేసింది. 2015 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండినవారిని పరిహారానికి అర్హులుగా నిర్ణయించింది. ఈ మేరకు 4,231 మంది యువతను పరిహారానికి అర్హులుగా గుర్తించారు. అయితే వారిలో ఇప్పటికి సగం మందికి మాత్రమే పరిహారం అందించారు. యువకులకు పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం యువతుల విషయంలో స్పష్టత ఇవ్వలేదని నిర్వాసిత మహిళలు అంటున్నారు. కొందరు నిర్వాసితుల కుటుంబాల్లో ఇద్దరు కుమారులకు పరిహారం అందింది. మరికొందరి ఇళ్లల్లో ఇద్దరు కుమార్తెలు ఉన్నా పరిహారం అందకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు.

తాగడానికి నీళ్లు లేవు
కాలనీలో నీటి వసతి లేక అరిగోస పడుతున్నాం. బోరు బావుల నుంచి నీరు చిన్న దారలా పోస్తుంది. పది నిమిషాలుంటే ఒక్క బిందె నిండుతుంది. ఎండాకాలం ఏ పనికి పోకుండా కేవలం నీరు తెచ్చుకోవడానికే సరిపోతుంది. 
    – దూలపల్లి పోశవ్వ, కొదురుపాక 

మరిన్ని వార్తలు