‘రేసు’గుర్రాల్లో అభద్రతాభావం

14 Mar, 2014 23:04 IST|Sakshi
‘రేసు’గుర్రాల్లో అభద్రతాభావం

సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ఆశావహుల్లో అభద్రతాభావం నెలకొంది. టికెట్ రేసులో దూసుకుపోతున్నా.. పొత్తుల్లో తమ స్థానం ఎక్కడ   గల్లంతవుతుందోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. టికెట్ కోసం సొంతపార్టీలోని ప్రత్యర్థులతో తలపడుతున్న వారిని సీట్ల సర్దుబాటు ప్రచారం కలవరానికి గురిచేస్తోంది. బీజేపీ- టీడీపీ, కాంగ్రెస్ -టీఆర్‌ఎస్‌ల మధ్య ఎన్నికల సయోధ్య ఉంటుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తారనే ప్రచారానికి కేసీఆర్ పుల్‌స్టాప్ పెట్టినప్పటికీ, కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందనే సంకేతాలను ఇరుపార్టీలు ఇస్తున్నాయి.

 ఈ తరుణంలో టీడీపీ కూడా బీజేపీతో జత కట్టేందుకు ఆరాటపడుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో సీట్లపై కన్నేసిన ఆశావహులకు ఈ పరిణామాలు మింగుడు పడడంలేదు. కష్టకాలంలో పార్టీని బతికించిన తమ స్థానాలకు పొత్తుల పేర ఎసరు పెట్టే ఆలోచనపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ జతకడితే.. అధికశాతం కాంగ్రెస్ పార్టీ నేతలే నష్ట పోవాల్సివుంటుంది. ముఖ్యంగా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన కేడరేగాకుండా... సమర్థ నాయకత్వం ఉంది. అయితే, పొత్తుల రూపేణా ఈ స్థానాలను టీఆర్‌ఎస్ తన్నుకుపోతే తమ పరిస్థితేంటనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.

 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున తాండూరు నుంచి ఎం.రమేశ్ పోటీచేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇటీవల మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఇది రమేశ్‌కు ప్రతికూలంగా మారింది. టీఆర్‌ఎస్ -కాంగ్రెస్‌ల మధ్య సయోధ్య కుదిరితే.. సిట్టింగ్‌లో భాగంగా ఈ స్థానం కోసం టీఆర్‌ఎస్ పట్టుపట్టే అవకాశముంది.

ఐదేళ్లుగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న రమేశ్‌కు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తుండగా.. మరోవైపు ఇదే సీటుపై మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కూడా ఆశలు పెట్టుకున్నారు. రమేశ్ పోటీ చేయని పక్షంలో తాను బరిలో దిగాలని భావిస్తున్నారు. వీరిద్దరితోపాటు మరోనేత విశ్వనాథ్‌గౌడ్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు ఈ సీటును వదిలితే.. కాంగ్రెస్ ఆశావహుల కు తీరని అన్యాయం జరిగే అవకాశముంది. అదే సమయంలో టీఆర్‌ఎస్‌కు కాకుండా.. కాంగ్రెస్‌కు కేటాయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి సీటు గల్లంతు కానుంది.

 పరిగి నుంచి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆయన రెండేళ్ల క్రితం కారెక్కారు. ఈ సారి కూడా అక్కడి నుంచే పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ నియోజకవర్గంలో బలమైన ఇద్దరు నేతలు కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. మాజీ మంత్రి కమతం రాంరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి(టీఆర్‌ఆర్) సీటు ఆశలు పెట్టుకున్నారు. 2009లో కమతంకు బీ ఫారం దక్కగా.. తిరుగుబాటు అభ్యర్థిగా టీఆర్‌ఆర్ పోటీచేశారు. దీంతో హరీశ్వర్‌రెడ్డి సునాయసంగా గెలిచారు. ఈ సారి ఎలాగైనా సీటు దక్కిం చుకోవాలని భావిస్తున్న రామ్మోహన్.. నాలుగేళ్లుగా నియోజకవర్గానికే పరిమితమై పార్టీని బలోపేతంచేసే దిశగా కృషి చేస్తున్నారు. పొత్తు కుదిరితే ఈయన ఆశలు అడియాసలైనట్లే. టీఆర్‌ఎస్‌కు జిల్లాలో పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న కొప్పులకు టికెట్ నిరాకరించే సాహసం గులాబీ నాయకత్వం చేసే అవకాశాలు చాలా తక్కువ.

 చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఇటీవల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడి కాంగ్రెస్ నాయకుల్లో గుబులు మొదలైంది. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండే అవకాశముందనే సంకేతాలు వారిని గందరగోళంలో పడేస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీచే సిన కాలె యాదయ్య, ఎస్సీ సెల్ నేత వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీరికి తోడు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్  కూడా టికెట్ రేసులో ఉన్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లోనూ టికెట్ల లొల్లి నడుస్తోంది. రత్నంకు కాకుండా మొదట్నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న తనకు సీటివ్వాలని ఆంజ నేయులు పట్టుబడుతున్నారు.

 బీజేపీతో టీడీపీకి మైత్రీ కుదిరితే ఎల్‌బీ నగర్ స్థానాన్ని బీజేపీ కోరే వీలుంది. ఇది తెలుగు తమ్ముళ్లకు ఇరకాటంగా మారనుంది. టీడీపీ తరుఫున ఇక్కడి నుంచి పోటీ కి పలువురు ఆసక్తి చూపుతున్నారు. 2009లో పోటీచేసిన ఎస్వీ క్రిష్ణ ప్రసాద్, సామ రంగారెడ్డి సీటును ఆశిస్తున్నారు. అలాగే బీజేపీ తరుఫున మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రమేశ్, మాజీ కౌన్సిలర్ వంగా మధుసూదన్‌రెడ్డి, పేరాల చంద్రశేఖర్ బరిలో ఉన్నారు.

 పొత్తు వల్ల ఏదో ఒక పార్టీలోని ఆశావహులను నిరాశకు గురిచేసే అవకాశముంది. అలాగే ఉప్పల్, మేడ్చల్, కూకట్‌పల్లి, తాండూరుపై కూడా బీజే పీ కన్నేసింది. ఉప్పల్‌లో టీడీపీ నేత వీరేందర్‌గౌడ్, బీజేపీ తరుఫున ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మేడ్చల్‌లో కొంపల్లి మోహన్‌రెడ్డి (బీజేపీ), నారెడ్డి నందారెడ్డి, నక్కాప్రభాకర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి(టీడీపీ), కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు(టీడీపీ), మాధవరం కాంతారావు (బీజేపీ) పోటీపడుతున్నారు. తాండూరులో మారిన సమీకరణల నేపథ్యంలో కొంత అస్పష్టత నెలకొంది.

మరిన్ని వార్తలు