ఉపాధే లక్ష్యంగా వర్సిటీ విద్య

3 Nov, 2016 02:13 IST|Sakshi
ఉపాధే లక్ష్యంగా వర్సిటీ విద్య

ఉన్నత విద్యాశాఖ కసరత్తు  
సీబీసీఎస్ అమలయ్యేలా చర్యలు

సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీలతో ఉపాధి అవకాశాలు కరువవడంతో యూనివర్సిటీలు నిర్వహిస్తున్న కోర్సుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ఈ దిశగా రాష్ట్రంలోని యూనివర్సిటీలను సమాయత్తం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంను (సీబీసీఎస్) ప్రవేశ పెట్టిన ఉన్నత విద్యాశాఖ ఇకపై దాన్ని పక్కాగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోనుంది. అలాగే సంప్రదాయ కోర్సులు చదివే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

డిగ్రీ కోర్సుల సిలబస్‌ను పూర్తిగా మార్చడంతోపాటు సీబీసీఎస్‌ను కచ్చితంగా అమలు చేసేలా యూనివర్సిటీలు కార్యాచరణ రూపొందించుకోవాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. సంప్రదాయ డిగ్రీలు చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పష్టం చేసింది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఫైర్ సర్వీసెస్, కంప్యూటర్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, డాటా ఎంట్రీ తదితర సబ్జెక్టులను కూడా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది.

ప్రమాణాలు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా..
దేశంలో 20 విద్యా సంస్థలను వరల్డ్ క్లాస్ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో.. ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల పోటీని తట్టుకొని రాష్ట్ర యూనివర్సిటీలు నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం తెలిపారు.

అన్నింటిని ప్రపంచస్థాయి విద్యాసంస్థలుగా తీర్చిదిద్దకపోయినా, ఆ స్థాయి లక్ష్యాలతో వర్సిటీల్లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎం.ఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక మైనింగ్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే ప్రారంభం నుంచే తీర్చిదిద్దుతున్నుట్లు తెలిపారు. తీరు మార్చుకుంటే ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్ వంటి వర్సిటీలను ఆ స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
 
ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్తగూడెం వర్సిటీ
కొత్తగూడెం మైనింగ్ యూనివర్సిటీ ప్రపంచస్థాయి విద్యాసంస్థగా మార్చేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఐదు ప్రభుత్వ రంగ సంస్థలను, మూడు ఐఐటీల నిఫుణులను భాగస్వాములను చేసి, కోర్సుల డిజైన్, అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తమ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది. ఎన్‌ఎండీసీ, సింగరేణి, కోల్ ఇండియా, జెన్‌కో, రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లను భాగస్వాములను చేయడంతోపాటు వాటి అవసరాలకు అనుగుణంగా కోర్సులను డిజైన్ చేస్తోంది. అలాగే కాన్పూర్, ఖరగ్‌పూర్, ధన్‌బాద్ మైనింగ్ వర్సిటీ ప్రొఫెసర్లకు భాగస్వామ్యం కల్పించింది. నియామకాలు కూడా జాతీయ స్థాయిలో చేపట్టే విధానాన్ని రూపొందిస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా