సిమెంట్ పరిశ్రమలకు కఠిన నిబంధనలు!

14 Nov, 2014 04:49 IST|Sakshi
  • కాలుష్య కారక పరిశ్రమల్లో సిమెంట్ రంగం
  •  ‘కంప’ నిధుల్లో 95 శాతం రాష్ట్రాలకే
  • రెండు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలి
  • సాక్షి, హైదరాబాద్: వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న 17 రకాల్లో ఒకటైన సిమెంట్ పరిశ్రమలకు కాలుష్య నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. పరిశుభ్రమైన పర్యావరణం కోసం నిబంధనలను మరింత ఆధునీకరించనున్నామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అటవీ శాఖ కార్యక్రమాల సమీక్ష కోసం వచ్చిన మంత్రి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా’ (పచ్చని, పరిశుభ్ర భారతం) తమ ప్రభుత్వ నినాదమని తెలిపారు.

    280 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలు వదిలే దుమ్ము,ధూళితో వాతావరణం బాగా కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అమలు పర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. ‘విధ్వంసం లేని అభివృద్ధి, మానవజాతి వికాసం’ తమ ఉద్దేశమని ప్రకటించారు. కంప నిధుల్లో 95 శాతం రాష్ట్రాలకే... పర్యావరణ అభివృద్ధిలో భాగంగా ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నిధుల నిర్వహణ, ప్రణాళిక సంస్థ (కంప) నిధుల్లో 95 శాతాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించిందని, ఈ మేరకు నియమ నిబంధనలతో ముసాయిదాను రూపొందిం చామని జవదేకర్ తెలిపారు.

    అభివృద్ధి పథకాల కోసం వంద ఎకరాలలోపు అటవీ ప్రాంతాన్ని ఇచ్చే అధికారాన్ని ఇకపై ప్రాంతీయ సాధికారిక కమిటీలే చూస్తాయని చెప్పారు. మైనింగ్, ఆక్రమణల క్రమబద్ధీకరణ, జల విద్యుత్ ప్రాజెక్టులకు స్థలాలు ఇచ్చే విషయాన్ని మాత్రమే కేంద్ర పర్యావరణ శాఖ చూస్తుందని తెలిపారు.
     

మరిన్ని వార్తలు