84 గ్రామాల వ్యధ!

28 Jun, 2014 23:27 IST|Sakshi
84 గ్రామాల వ్యధ!

మొయినాబాద్ : జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్‌ల పరిరక్షణకు టీడీపీ హయాంలో జారీ చేసిన 111జీఓ ఆయా చెరువుల ఎగువ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి శాపంగా పరిణమించింది. గతంలో జంటనగరాలకు దాదాపు పూర్తిగా ఈ చెరువుల ద్వారానే తాగునీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం నగర విస్తీర్ణం పెరగడంతో మంజీరా, కృష్ణా, గోదావరి  జలాలు సరఫరా అవుతున్నాయి. జంట జలాశయాల నుంచి సరఫరా నామమాత్రంగానే కొనసాగుతోంది. 1996లో చంద్రబాబు హయాంలో ఈ రెండు చెరువుల పరిరక్షణకు జీఓ 111 జారీ చేశారు.

జిల్లాలోని ఎగువ ప్రాంతాలైన చేవెళ్ల, మొయినాబాద్, శంషాబాద్, శంకర్‌పల్లి, షాబాద్, రాజేంద్రనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు మండలాల పరిధిలోని 84 గ్రామాలను ఈ జీఓ పరిధిలోకి తీసుకురావడంతో ఆయా గ్రామాల్లో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ ఆంక్షలు తమ గ్రామాల అభివృద్ధికి శాపంగా మారాయంటూ ఆయా గ్రామాల ప్రజలు 111జీఓ ఎత్తివేయాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. రాజకీయ పార్టీలు సైతం ఉద్యమంలో పాల్గొన్నాయి. 2009, ఇటీవలి సార్వత్రిక ఎన్నిక సందర్భంగానూ ఈ జీఓ ఎత్తివేతకు అన్ని పార్టీలూ హామీ ఇచ్చాయి. చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.   
 
 జీఓ పరిధిలో ఇవీ ఆంక్షలు..
* జీఓ 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. వెంచర్లు, లేఅవుట్లు చేయవద్దు.
* ఒకవేళ లేఅవుట్ చేస్తే అందులో పది శాతం భూమిలోనే నిర్మాణం చేపట్టాలి. అంటే పది ఎకరాల భూమిలో లేఅవుట్ చేస్తే అందులో ఒక ఎకరంలోనే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇక మిగిలిన భూమంతా పార్కులు, పచ్చదనం, ఇతర అవసరాలకు వదిలేయాలి.
* ఇందులో వ్యవసాయానికీ ఆంక్షలు విధించారు. పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకూడదు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి వీల్లేదు.
* జీఓ పరిధిలోని గ్రామాల మురుగు నీరు జలాశయాల్లోకి వదలకూడదు. ఈ సమస్యను తీర్చేందుకు గ్రామాల్లోనే మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి.
* ఈ భారాన్ని గ్రామ పంచాయతీలే భరించాలి. ప్లాంట్ల ఏర్పాటుకు ఒక్కోదానికి రూ.10లక్షలు ఖర్చవుతుంది. అంత భారాన్ని మోయలేమని అవి చేతులెత్తేశాయి.
 
అడుగడుగునా ఉల్లంఘనలే
జీఓ 111 నిబంధనలు పకడ్బందీగా అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆంక్షలతో రైతులు, సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న అధికారులు.. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న బడాబాబులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రాంతంలో బడా నిర్మాణాలు జరిగేందుకు వీల్లేదు. కానీ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలతోపాటు కార్పొరేట్ పాఠశాలలు ఈ ప్రాంతంలో అనేకం వెలిశాయి. వాస్తవానికి కళాశాలలు, పాఠశాలల భవనాలను వ్యవసాయేతర భూముల్లోనే నిర్మించాలి.
 
ఈ ప్రాంతంలోని భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు వీలు లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. కనీసం గ్రామ పంచాయతీలకు పన్నులు సైతం చెల్లించడంలేదు. వీటితోపాటు చాలా రకాల పరిశ్రమలు, వెంచర్లు, జలాశయాలను ఆనుకుని రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లు తామరతంపరగా వెలిశాయి. వీటిలోంచి వెలువడే మురుగునీరంతా నేరుగా జలాశయాల్లో కలుస్తోంది. జలాశయాల చెంతనే ఉన్న గ్రామాల్లోంచి సైతం మురుగునీరు వాటిలో కలుస్తోంది. మరోపక్క స్వచ్ఛంద, పర్యావరణ పరిరక్షణ సంస్థలు జలాశయాలను పరిరక్షించేందుకు జీఓ 111పై కోర్టులకెక్కాయి. ఈ వ్యవహారం ఎటూ తేలలేదు.
 
 ప్రత్యామ్నాయమేంటి?
 ప్రస్తుతం గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల నుంచి నగరంలోని కొన్ని ప్రాంతాలకే తాగునీరు అందిస్తున్నారు. కృష్ణా మూడోదశ పనులు పూర్తి చేసి నీటి సరఫరా చేయడం, గోదావరి నీటిని సైతం హైదరాబాద్‌కు తీసుకురావడం, గ్రామాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయడం, అవసరమైతే అండర్‌గ్రౌండ్ డైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని మూసీలోకి కలపడం వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ఆలోచించాలని రైతులు కోరుతున్నారు.
 
అవసరానికి భూములు అమ్ముకోలేకపోతున్నాం

హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నా.. ఇక్కడి భూములకు మాత్రం ధరలు రావడంలేదు. ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపల ఉన్న ప్రాంతంలో ఎకరం భూమి రూ.10 కోట్లు పలికితే మా భూములకు మాత్రం రూ.10 లక్షలు కూడా రావడంలేదు. దీంతో సామాన్య రైతులు తమ కుటుంబ అవసరాలకు భూములు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది.      
 - గడ్డం వెంకట్‌రెడ్డి, సురంగల్, మొయినాబాద్ మండలం
 
 ఉద్యమించినా ఫలితంలేదు
111 జీఓ ఎత్తేయాలని 84 గ్రామాల రైతులతో కలిసి నాయకులు ఉద్యమం చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రిని కూడా కలిశాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు.ఈ జీఓ మా పాలిట శాపంగా మారింది. మా దుస్థితిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదు. ప్రస్తుత పాలకులైనా పట్టించుకుంటారో లేదో చూడాలి.
  - క్యామ పద్మనాభం,ఎంపీటీసీ మాజీ సభ్యుడు,కనకమామిడి, మొయినాబాద్ మండలం

మరిన్ని వార్తలు