జూడాల సమ్మె

7 Nov, 2014 02:44 IST|Sakshi

నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం కలకలం సృష్టించింది. అకస్మాత్తుగా వారు ఆందోళనకు పూ నుకోవడంతో అధికారులు కంగు తిన్నారు. ఈ అంశంపై డీఎంఈ తీవ్రంగా స్పందించి 46 మంది జూడాలను డెరైక్టరేట్‌కు సరెండర్ చేయించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ వరకు జూడాలు ర్యాలీగా వెళ్లి వైస్ ప్రిన్సిపాల్ రమాదేవికి సమ్మె నో టీసు అందించారు. అనంతరం ఆస్పత్రిలో వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలి పారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించడంలో పభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని నిరసన వ్యకం చేశారు.

తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. సమ్మె విషయం తెలుసుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో సమ్మె చేయడం ఏమిటని వైద్యాధికారులను ప్రశ్నించారు. ‘సమ్మెలో ఎంత మంది పాల్గొన్నారు, సమ్మె నోటీసులో ఎంత మంది సంతకాలు చేశారు’ తదితర వివరాలతో తగిన నివేదిక పంపాలని, జూడాలను వెంటనే డెరైక్టరేట్‌కు సరెండర్ చేయాలని ఆదేశించారు.

డీఎంఈ ఆదేశాలతో కళాశాల అధికారులు స్పందించి ఆగమేఘాలపై నివేదిక తయారు చేశారు. 46 మంది జూనియర్ డాక్టర్లు సంతకాలు చేసి, సమ్మెలో పాల్గొన్నారని తెలుపుతూ వారిని సరెండర్ చేస్తూ  నివేదిక పంపించారు. ఈ విషయాన్ని వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి ధ్రువీకరించారు.

 కొంత కాలంగా గైర్హాజరు
 109 మంది జూనియర్ డాక్టర్లు పీజీ విద్య కోసం అక్టోబర్‌లో మెడికల్ కళాశాలకు వచ్చారు. వీరిని పది విభాగాలకు కేటాయించారు. వైద్య సేవలు అందించాల్సింది పోయి వీరు నెల రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నారు. కొంతమంది స్థానికంగా, మరికొందరు వైద్యులు హైదరాబాద్‌లోని ప్రయీవేటు ఆస్పత్రులలో పని చేస్తున్నారు.

ఈ విషయంలో ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన అధికారులు జూనియర్ డాక్టర్ల హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు రావాలని గట్టిగా హెచ్చరించారు. దీంతో వారు విధులకు రావడం మొదలుపెట్టారు. వారం రోజుల క్రితం, కళాశాలలో సౌకర్యాలు లేవని, సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు అందించారు. అనంతరం అందుబాటులో లేకుండాపోయారు. తిరిగి గురువారం హైదరాబాద్‌లోని జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా సమ్మె నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. మరోవైపు  ఉన్నతాధికారులు కఠిన చర్యలకు దిగడం పరిస్థితిని ఎటు తీసుకెళ్తేందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు