భరోసా ఏదీ?

17 Nov, 2014 04:13 IST|Sakshi
భరోసా ఏదీ?

పేద తల్లిదండ్రులకు
 ఆసరాగా నిలిచే ‘బంగారు తల్లి’కి భరోసా కరువైంది. ఆడపిల్లలపై వివక్షను రూపమాపేందుకు గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి జిల్లాలో ఆదరణ కరువైంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
 
 ‘బంగారు తల్లి’ అమలు ఇలా..
 దరఖాస్తు చేసుకున్న వారు                     32,008
 మొదటి విడ త డబ్బులు అందుకున్న వారు     12,942
 అర్హులుగా గుర్తించినా డబ్బులు రానివారు        13,799
 ఇంటివద్ద ప్రసవం అయినవారు                3,115
 
  సాక్షి, మహబూబ్‌నగర్:  జననీ సురక్ష యోజన, సుఖీభవ, రాజీవ్ విద్యాదీవెన వంటి పథకాలతో సంబంధం లేకుండా బంగారు తల్లి పథకాన్ని రూపొందించారు. జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటివరకు 32,008 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో కేవలం 12,942 మందికి జనన నమోదు సమయంలో ఇచ్చే రూ.2,500 మాత్రమే అందాయి. మిగతా పద్దుల మాటే మరిచారు.

ఈ పథకానికి అర్హత సాధించిన 13,799 మంది లబ్ధిదారుల జాబితాను సెర్ప్‌కు పంపించారు. వీరికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. అలాగే ఇంటి వద్ద డెలివరీ జరిగిన 3,115 మంది కూడా డబ్బులు రాలేదు. పది నెలలుగా లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపలేకపోతున్నారు.

 స్పందన కరువు
 బంగారు తల్లికి దరఖాస్తు చేసుకున్న వారికి అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రావడంలేదు. అయితే ఈ పథకాన్ని ప్రాథమికంగా నమోదు చేసుకునే వారు మండల సమాఖ్య కోఆర్డినేషన్(ఏపీఎం), మండల సమాఖ్య ప్రతినిధి, సీడీపీఓ అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో వారేమీ చేయలేకపోతున్నారు. అయితే మరికొన్ని చోట్ల బ్యాంకులతో సమస్య తలెత్తింది.

ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా తల్లి ఖాతాలో జమచేస్తారు. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. కొన్నిఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లు అధికారుల రికార్డుల్లో పేర్కొంటున్నా వాస్తవానికి చేరడం లేదు.

 లబ్ధిపొందే తీరు..
 ఆడపిల్ల పుట్టగానే జనన నమోదు సమయంలో నెలరోజుల వ్యవధిలోనే రూ.2,500 బ్యాంకు ఖాతాలో జయచేస్తారు. ఆ తర్వాత 1-2 సంవత్సరాల వరకు టీకాల నిమిత్తం ఏడాదికి రూ.వెయ్యి చొప్పున అందనున్నాయి.

  3- 5 ఏళ్ల మధ్య సంవత్సరానికి రూ.1,500, 6-10 ఏళ్ల వరకు ఏడాదికి రూ.రెండు వేల చొప్పున అందనుంది. 11-13 ఏళ్లవరకు అంటే ఆరు నుంచి 8వ తరగతి వరకు ఏడాదికి రూ.2,500 అందుతుంది.
  14-15 ఏళ్ల వరకు అంటే తొమ్మది, పదో తరగతి చదివే సమయంలో ఏడాదికి రూ.మూడువేల చొప్పున అందనుంది.

  16-17 ఏళ్ల వరకు ఇంటర్ చదివే వరకు ఏడాదికి రూ.3,500, 18- 21 ఏళ్ల వరకు గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో ఏడాదికి రూ.4వేల చొప్పున అందుతుంది. ఇలా మొత్తం రూ.55,500 బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా రూపొందించారు.

  అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత ఇంటర్‌మీడియట్ పాసైతే రూ.50,000, గ్రాడ్యుయేషన్ పాసైతే రూ.లక్ష ఇలా మొత్తం రూ.1,55,000 అదనంగా అందనుంది. మొత్తం మీద బంగారు తల్లికి రూ.రెండు లక్షల మేర లబ్ధి చేకూరనుంది.
 
 డిసెంబర్‌లో డబ్బులు వచ్చే అవకాశముంది
 బంగారుతల్లి పథకం సంబంధించి డబ్బులు అందని మాట వాస్తవమే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు డబ్బులు రావడంలేదు. అర్హులైన 13వేల మందికి కూడా మొదటి విడతగా అందజేయాల్సిన డబ్బులు రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత విధివిధానాలు ఖరారు కాలేదు. ప్రస్తుతం సభలో బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో బంగారుతల్లి అర్హులకు వచ్చే నెలలో డబ్బులు వచ్చే అవకాశముంది.  
 - చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ
 
 ఎవర్ని అడిగినా సమాధానం లేదు
 బంగారు తల్లి పథకం కోసం ధరకాస్తులు చేసుకుని నాలుగు నెలలు అ వుతున్నా ఇప్పటివరకు ఒక్కపైసా రాలేదు. కా ర్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. పైసలు వస్తాయో రావో కూడా చెప్పడం లేదు. మా మండలంలో 680 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 120మందికి మాత్రమే రూ.2500 చొప్పున అందించారు.
   - సుమేరా, మానవపాడు
 
 ఒక్క రూపాయి ఇవ్వలేదు
 బంగారుతల్లి పథకం కింద గ తేడాది నవంబర్ 9న అధికారులు బాండ్ పేపర్ ఇచ్చారు. ఏడాదిగా ఒక్కరూపాయి కూడా అందలేదు. ఐకేపీ అధికారులు బ్యాంకు ఖాతాలో జమ చేశామని చెబుతున్నా.. డబ్బులు మాత్రం రాలేదు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
  పాలెం యూబీఐ పరిధిలో బంగారు తల్లి పథకం లబ్ధిదారులకు ఏ ఒక్కరికీ డబ్బులు రాలేదు.
 - గన్నోజు సుమతి, పాలెం

>
మరిన్ని వార్తలు