సుప్రీంకోర్టులో ఒక్క బీసీ జడ్జీ లేరు 

28 Apr, 2019 02:05 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య 

హైదరాబాద్‌: దేశ జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి సుప్రీంకోర్టులో ఒక్క జడ్జి కూడా లేకపోవడం న్యాయవ్యవస్థకే మాయని మచ్చని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది సమర్థులైన న్యాయవాదులు ఉన్నప్పటికీ హైకోర్టు జడ్జీలుగా అవకాశం కల్పించలేని దీనస్థితిలో ప్రభుత్వాలు, కోర్టులు ఉన్నాయని ఆరోపించారు. 71 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఉన్నత న్యాయవ్యవస్థలో ఈ వర్గాలకు ప్రాతినిధ్యంపై ఇటీవల పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికలో 5 శాతం ప్రాతినిధ్యం మించలేదని చెప్పడం శోచనీయమని అన్నారు. ‘లాయర్స్‌ ఫోరం ఫర్‌ సోషల్‌ జస్టిస్‌’ఆధ్వర్యంలో శనివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో ‘రాజ్యాం గం–న్యాయవ్యవస్థ’అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ఫోరం అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి రవీందర్‌ సయన్వయకర్తగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణయ్య మాట్లాడుతూ.. ఉన్నత న్యాయస్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యా యమూర్తులు లేకపోవడంతో సామాజిక న్యా యం దెబ్బతింటుందని అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు