ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిపేదెప్పుడో!

12 Jun, 2018 12:58 IST|Sakshi

ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు

రైల్వే అధికారులకు విన్నవించినా పట్టని వైనం     

సాక్షి, దేవరకద్ర రూరల్‌ :  దేవరకద్ర రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దిపడుతున్నారు. ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని ప్రయాణికులు  కొన్నేళ్లుగా రైల్వే అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. అలాగే వివిధ సందర్భాలలో ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు విన్నవిస్తున్నా వారు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ స్టేషన్‌ నుంచి ఇటు హైదరాబాద్‌ వైపు, అటు కర్నూల్‌ వైపు దాదాపు 25కు పైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వెళ్తుంటాయి. కానీ ఏ ఒక్కటీ రైల్వేస్టేషన్‌లో నిలుపడం లేదు.

 
40గ్రామాలకు కూడలి  

దేవరకద్రలో వ్యవసాయ మార్కెట్‌యార్డుతో పాటు మూడు మండలాలు 40కి పైగా గ్రామాలకు దేవరకద్ర కూడలిగా ఉంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం, స్విట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల దేవరకద్రకు 6కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రం కావడం వల్ల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపడం వల్ల రోజురోజుకూ దూరప్రాంతాలకు ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. మహబూబ్‌నగర్‌ వెళ్లి అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

ప్రతిరోజు దేవరకద్ర రైల్వేస్టేషన్‌ మీదుగా మూడు ప్యాసింజర్‌ రైళ్లు హైదరాబాద్‌ వైపు, మూడు ప్యాసింజర్‌ రైళ్లు కర్నూలు వైపు వెళ్తున్నాయి. ఇవి మాత్రమే ఇక్కడ ఆపుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దినా, తమ అభిప్రాయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో నాయకులు, పాలకులు హామీలు ఇచ్చి తర్వాత పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, రైల్వే అధికారులు స్పందించాలని, దేవరకద్ర రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపేలా కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.


ఇబ్బందిగా ఉంది  
ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. కొన్నేళ్లుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిగురించి చాలా సార్లు రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించాం. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే అవకాశం ఉంటేనే ఇక్కడి స్టేషన్‌ నుంచి ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుందనే విషయం రైల్వే అధికారులు గుర్తించాలి.                    – కల్వ నరేశ్, దేవరకద్ర   

మరిన్ని వార్తలు