పట్టణాభివృద్ధికి మూడంచెల ప్రణాళికలు

21 Feb, 2015 02:05 IST|Sakshi

 మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై మూడంచెల ప్రణాళికలను రచించనున్నారు. పట్టణాలు, నగరాల అభివృద్ధితో పాటు సుపరిపాలన కోసం తీసుకోవాల్సిన చర్యలు, పనులను పూర్తిచేయడానికి పట్టే సమయం ఆధారంగా ఆయా పనులను విభజించి స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం ‘న్యాక్’లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రణాళికల తయారీకి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. స్వల్ప కాలిక ప్రణాళికలను పురపాలక శాఖ సంచాలకుడు జనార్దన్ రెడ్డి, మధ్య కాలిక ప్రణాళికలను ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఇంతియాజ్ అహమ్మద్, దీర్ఘకాలిక ప్రణాళికలను డీటీసీపీ సంచాలకుడు ఆనంద్ బాబు నేతృత్వంలోని బృందాలు రూపొందించనున్నాయి.
 
 పారిశుద్ధ్యం మెరుగుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ భారత్ అమలు, శ్మశాన వాటికల నిర్మాణం, మురికి వాడల అభివృద్ధి, సూపర్ మార్కెట్ల తరహాలో కొత్త మార్కెట్ల నిర్మాణం, ఖాళీల భర్తీ, ఉచిత నల్లా కనెక్షన్లు, మునిసిపల్ చట్టాలు, నిబంధనల్లో సవరణలు, పురపాలికల పనుల టెండర్లు నిర్వహించే మునిసిపల్ ఇంజనీర్ల అధికార పరిమితుల పెంపు తదితర అంశాలతో ప్రణాళికలు తయారు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. మళ్లీ ఈ నెల 24, 25, 26 తేదీల్లో వరుసగా సమావేశాలు నిర్వహించి స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల్లోని ప్రతిపాదనలపై ఉప సంఘం తుది నిర్ణయం తీసుకొని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
 
 ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి.గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించవద్దని మంత్రులు అధికారులను ఆదేశించడంతో వారు నోరు విప్పేందుకు సాహసించలేదు.

>
మరిన్ని వార్తలు