కరాటే ‘కోవిదుడు’

16 Oct, 2014 04:55 IST|Sakshi
కరాటే ‘కోవిదుడు’

* చిరుప్రాయంలోనే అత్యంత ప్రతిభ
* ఆరేళ్ల వయస్సులోనే బ్లాక్‌బెల్ట్ కైవసం
* తండ్రి బాటలో తనయుడు

కల్లూరు : వయస్సు ఆరున్నర ఏళ్లు. చదువేది మూడో తరగతే. ఇంత చిరుప్రాయంలో అతడు అత్యంత ప్రతిభను కనబరుస్తున్నాడు. కరాటేలో రాణిస్తూ బ్లాక్‌బెల్ట్ సైతం కైవసం చేసుకున్నాడు. కల్లూరుకు చెందిన గొల్లమందల కోవిద్ పట్టణంలోని సెంచరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి సురేష్‌కుమార్ కరాటే మాస్టర్. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఆసక్తి ఉన్న వారికి కరాటేలో తర్ఫీదు ఇస్తున్నాడు. తండ్రి వద్ద శిక్షణ తీసుకున్న కోవిద్ ఈ విద్యలో దూసుకెళ్తున్నాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు అత్యంత ప్రతిభను చాటుతున్నాడు. గత నెల వరంగల్‌లో వరల్డ్ ఫునకోస్ షోటోకాన్ కరాటే రాష్ట్ర చీఫ్ ఎగ్జామినర్ ఎం.డి.యాకూబ్ నిర్వహించిన బెల్ట్ టెస్టులో రాణించాడు. బ్లాక్‌బెల్ట్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు.
 
కోవిద్ సాధించిన విజయాలు
* 2013 ఆగస్టు 25న హన్మకొండలో జరిగిన స్టేట్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్ షిప్ పోటీల్లో అండర్-10 బాలుర కటా విభాగంలో తృతీయ స్థానం.
* 2013 అక్టోబర్ 20న విజయవాడలో జరిగిన ఫస్ట్ ఆలిండియా ఇన్విటేషనల్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో కటా విభాగంలో ప్రథమ స్థానం.
* 2013 నవంబర్ 10న గుంటూరులోని మంగళగిరిలో జరిగిన ఏపీ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో కటా విభాగంలో ప్రథమ స్థానం.
* 2013 డిసెంబర్ 22న వరంగల్‌లో జరిగిన నేషనల్ వరల్డ్ ఫునకోస్ షోటోకాన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలో కటా విభాగంలో ద్వితీయ స్థానం.
* ఈ ఏడాది జనవరి 14న ఏపీలోని నిడదవోలులో జరిగిన 14వ ఓపెన్ ఇన్విటేషనల్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ద్వితీయ స్థానం.
* ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఖమ్మంలో నిర్వహించిన స్టేట్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్ షిప్ పోటీల్లో కటా విభాగంలో ద్వితీయ స్థానం సాధించాడు.
 
నిరంతర శిక్షణతోనే..
నిరంతర శిక్షణ ద్వారా కరాటేలో ప్రతిభ చాటొచ్చు. మా అబ్బాయి కోవిద్ అదే చేశాడు. దీంతో ఇంత చిన్నప్రాయంలోనే అతడు రాణించాడు. కరాటేలో కోవిద్ ముందుకు దూసుకెళ్లడం ఒక తండ్రిగానే కాకుండా గురువుగా గర్వపడుతున్నాను.  
 - గొల్లమందల సురేష్ కుమార్, కరాటే మాస్టర్

మరిన్ని వార్తలు