‘అవని’ కూనలు సురక్షితం

20 Nov, 2018 11:02 IST|Sakshi

వాటికి వేటాడటంపై పూర్తి పట్టు వచ్చింది

యవత్‌మాల్‌లో గుర్రం పిల్లను చంపాయి

‘సాక్షి’తో సిటీ వేటగాడు షఫత్‌ అలీ ఖాన్‌

సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని యవత్‌మాల్‌ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న మ్యానీటర్‌ (ఆడపులి) ‘అవని’ని వేట జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని మట్టుపెట్టిన హైదరాబాదీ షార్ప్‌షూటర్‌ నవాబ్‌ అస్ఘర్‌ అలీ ఖాన్, ఆయన తండ్రి నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌లను కేంద్ర మంత్రి మేనకగాంధీ సహా అనేక మంది విమర్శించారు. అవనిని చంపడంతో దాని రెండు కూనలు దిక్కుతోచని స్థితికి చేరతాయని, వేటాడటం సైతం చేతకాక చనిపోయే ప్రమాదం ఉందంటూ వేలెత్తి చూపారు. అయితే కూనలు రెండూ పూర్తి స్థాయిలో సేఫ్‌ అని, వాటికి వేటాడటంపై పట్ట వచ్చిందని షఫత్‌ అలీ ఖాన్‌ సోమవారం పేర్కొన్నారు. ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ... ‘ఆదిలాబాద్‌కు 60 కిమీ దూరంలో మహారాష్ట్రలో తిప్పేశ్వర వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ళ వయస్సున్న అవని అనే ఆడపులి 20 నెలల క్రితం గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్‌మాల్‌ వరకు వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న అడవి నుంచి పొలాల్లోకి వెళ్ళి ఆహారం కోసం వెతుక్కుంది. ఈ నేపథ్యంలో అక్కడకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. అప్పటి నుంచి ఆ పులి మ్యానీటర్‌గా మారి పంజా విసురుతూనే ఉంది.

దాదాపు 11 నెలల క్రితం దీనికి జన్మించిన రెండు పులి పిల్లలు దీంతో కలిసే సంచరించాయి. ఈ మూడూ కలిసి యవత్‌మాల్‌ చుట్టూ ఉన్న 12 కిమీ పరిధిలో తమ ‘సామ్రాజ్యాన్ని’ విస్తరించాయి. తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలిసి మృతదేహాన్ని పీక్కు తింటున్నాయి. ఇలా ఆ మ్యానీటర్‌ చేతిలో 14 మంది చనిపోయారు. అక్కడి అటవీ శాఖ కోరిక మేరకు అస్ఘర్, నేను సెప్టెంబర్‌ రెండో వారంలో అక్కడకు చేరుకుని వేట మొదలెట్టాం. బంధించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ నెల 3న అవనిని మట్టు పెట్టాల్సి వచ్చింది. దీనిపై మేనకగాంధీతో పాటు అనేక మంది జంతు ప్రేమికులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ కూనల గతేంటంటూ ప్రశ్నించారు. దీంతో వాటి స్థితిని అధ్యయనం చేయడానికి ఉపక్రమించాం. అక్కడి కంపార్ట్‌మెంట్‌ నెం.655 వద్ద మేక, గుర్రం పిల్లల్ని ఎరగా వేశాం. ఆ కూనలకు వేటాడే శక్తి ఉంటే వచ్చి మేకను, బలమైన శక్తిని సముపార్జిస్తే గుర్రం పిల్లను పట్టుకు వెళ్తాయి. అక్కడ కెమెరా ట్రాప్‌ సైతం ఏర్పాటు చేశాం. శనివారం రెండు కూనలూ కెమెరాకు చిక్కాయి. ఆదివారం రాత్రి గుర్రం పిల్లను వేటాడి తినేశాయి. దీన్ని బట్టి ఆ రెండింటికీ ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టమైంది. ఇదే విషయాన్ని అక్కడి అటవీ శాఖ సైతం గుర్తించింది.  ఈ పరిణామంతో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న అవని కూనల వల్ల ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, వాటిని బంధించాల్సిన అవసరమూ ఇప్పటికి లేదని తేలింది’ అని వివరించారు.

మరిన్ని వార్తలు