పరిష్కరించుకుందాం రండి

30 Jul, 2018 01:01 IST|Sakshi

నేడు లారీ యజమానులతో రవాణా మంత్రి చర్చలు

వారి డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే!

సింగిల్‌ పర్మిట్‌ సహా అన్ని సమస్యలూ తీరుతాయని ఆశాభావం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని లారీల యజమానుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరిపేందుకు కేసీఆర్‌ సర్కారు ముందుకొచ్చింది. లారీల యజమానులను చర్చలకు ఆహ్వానించింది. యజమానుల సంఘం ప్రతినిధులతో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం చర్చలు జరపనున్నారు.

దీంతో దాదాపు రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సింగిల్‌ పర్మిట్‌ విధానానికి ఈ సమావేశంతో మోక్షం కలగనుందని సమాచారం. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న లారీలకు ఒకసారికి రూ. 1,600 చొప్పున పర్మిట్‌ ఫీజు వసూలు చేస్తండటంతో లారీ యజమానులపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఏపీని ఒప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొ చ్చిందని తెలియవచ్చింది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం, రవాణాశాఖ ఉన్నతాధికారులు సైతం సింగిల్‌ పర్మిట్‌ ఒప్పందం అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం తెలిపింది. అలాగే ఈ ఏడాది లారీ యజమానులు చెల్లించాల్సిన పన్ను రెండో త్రైమాసికం గడువు ఇప్పటికే ముగిసింది. కానీ సమ్మె కారణంగా లారీలు నడవలేదు కాబట్టి... చెల్లింపు గడువును ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పెంచిందని సంఘం పేర్కొంది.

సమ్మె విరమణకు ముందు హైడ్రామా?
కేంద్రం హామీతో దేశవ్యాప్తంగా సమ్మె విరమిస్తున్నట్లు ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) ప్రకటించినా తెలంగాణలో మాత్రం సమ్మె విరమణపై అర్ధరాత్రి దాకా హైడ్రామా నడిచింది. తమ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం ప్రకటించగా తెలంగాణ పరిధిలోని అంశాలపై సరైన హామీ రాలేదన్న కారణంగా రాష్ట్ర లారీ యజమానుల సంఘం సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రకటనతో రవాణా మంత్రి లారీ యజమానుల సంఘం నేతలతో మాట్లాడారు. రాష్ట్ర పరిధిలోని డిమాండ్లపై చర్చలు జరిపేందుకు సోమవారం వారిని చర్చలకు ఆహ్వనించారు. దీనికి సీఎం కేసీఆర్‌ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో లారీల యజమానుల సంఘం సమ్మె విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

రాష్ట్ర పరిధిలో లారీల యజమానుల డిమాండ్లు
రాష్ట్రవ్యాప్తంగా తైబజారు రుసుములను శాశ్వతంగా రద్దు చేయాలి.
    లారీ పరిశ్రమలో స్థిరపడేందుకు ముందుకొస్తున్న పేద, మధ్యతరగతి యువతకు ప్రభుత్వమే ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక డ్రైవింగ్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలి.
    ఓవర్‌లోడ్‌ తీసుకెళ్తున్నందుకు లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు న్యాయ విచారణ పూర్తయ్యేదాకా డ్రైవర్ల లైసెన్స్‌ రద్దు విషయంలో చర్యలు తీసుకోవద్దు.
    రాష్ట్రంలో టోల్‌గేట్ల మధ్య ప్రయాణించే దూరం ఆధారంగానే రుసుములు వసూలు చేయాలి.
    ఇద్దరు డ్రైవర్ల విధానం నుంచి మినహాయింపు కల్పించాలి.

మరిన్ని వార్తలు