టాలీవుడ్‌ హీరోలు వర్సెస్‌ పోలీసులు

3 Jun, 2018 10:33 IST|Sakshi

నేడు పోలీస్, సెలబ్రిటీ క్రికెట్‌ మ్యాచ్‌  

ఎల్‌బీస్టేడియంలో సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రారంభం 

ఉచిత ప్రవేశం, భారీగా హాజరుకావాలని సీపీ అంజనీకుమార్‌ పిలుపు

సాక్షి, సిటీబ్యూరో : కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పోలీసు క్రికెట్‌ లీగ్‌ విజయవంతమైందని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ పోలీసు క్రికెట్‌ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌తో ఎల్‌బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తలపడుతుందని తెలిపారు. క్రికెట్‌తో ప్రజలతో మమేకమైన తీరు, సెలబ్రిటీల కామెంట్లతో కూడిన టీజర్‌ (వీడియో)ను బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో శనివారం సీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో ముఖ్యంగా యువతతో భాగస్వామ్యం అవుతూ  ఏప్రిల్‌ 10 నుంచి కాలనీ, సెక్టార్‌ లెవల్, ఠాణా స్థాయి, డివిజనల్‌ స్థాయి, జోనల్‌ స్థాయిల్లో క్రికెట్‌ పోటీలు నిర్వహించామన్నారు.

ఇప్పటివరకు 270 జట్ల నుంచి 4050 మంది ఆటగాళ్లు పోటీల్లో పాల్గొన్నారన్నారు. అన్ని విభాగాల్లో 44000 ప్రజలు భాగస్వామ్యులయ్యారు. పోలీసు క్రికెట్‌ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఎల్‌బీస్టేడియంలో ఆదివారం సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ జట్టుతో తలపడుతుందని తెలిపారు. ఈ మ్యాచ్‌ సందర్భంగా సాంస్కృతిక శాఖ నుంచి కళా ప్రదర్శనలు  ఉంటాయన్నారు. ఆదివారం జరిగే మ్యాచ్‌కు నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమానికి హోం మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్, సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ, ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేశ్‌లు పాల్గొన్నారు.  

స్టార్‌ ప్లేయర్లు వీరు... 
సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ జట్టు తరఫున నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి, అఖిల్, నాని, శ్రీకాంత్, విజయ దేవరకొండ, నితిన్‌ తదితరులు పాల్గొంటారు. వీరితో పోలీసు క్రికెట్‌ జట్టు తలపడనుంది.    

టీజర్‌ను విడుదల చేస్తున్న నగర సీపీ అంజనీకుమార్‌ 

మరిన్ని వార్తలు