టమాటా ధర పైపైకి

12 Jan, 2019 03:37 IST|Sakshi

దిగుమతులు తగ్గి ధరలో అనూహ్య పెరుగుదల 

వారం కింద కిలో రూ.8.. ప్రస్తుతం రూ.32–35 

మదనపల్లిలో సాగు తగ్గడం, బూడిద తెగులు సోకడమే కారణం

 రాష్ట్రంలో సీజన్‌ ముగియడంతో 50 టన్నుల మేర ఆగిన సరఫరా

 క్యాప్సికం, కాకర, వంకాయ ధరల్లోనూ పెరుగుదలే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టమాటా ధర సామాన్యుడికి అందనంటోంది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కేజీ టమాటా రూ.35 పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు కిలో రూ.8కే లభించిన టమాటా ఇప్పుడు రైతుబజార్‌లోనే రూ.30కి చేరింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కేజీ రూ.20 పలికిన టమాటా శుక్రవారం బహిరంగ మార్కెట్‌లో రూ.32–35ల చొప్పున అమ్మారు. స్థానికంగా ఈ పంట సాగు చివరి దశకు చేరడం, ఏపీలోని మదనపల్లి ద్వారా దిగుమతులు తగ్గడం, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి అరకొర సరఫరా అవుతుండటంతో ఆ ప్రభావం ధరలపై పడుతోంది. 

తగ్గిన సరఫరా.. 
రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలోని వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో లక్ష ఎకరాల్లో టమాటా సాగు జరుగుతున్నా 15 శాతం అవసరాలనే తీరుస్తున్నాయి. దీంతో దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్ర మార్కెట్‌కు రోజూ 400 టన్నుల మేర దిగుమతి అవుతోంది. స్థానికంగా 50 టన్నులు వస్తుండగా, మిగతా 350 టన్నుల మేర పొరుగు రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతోంది. ఎక్కువగా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచే సరఫరా అవుతోంది. అయితే ప్రస్తుత సీజన్‌లో అక్కడ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఏపీ అధికారుల లెక్కల ప్రకారం ఒక్క మదనపల్లి మండల పరిధిలోనే గతేడాది 1,970 హెక్టార్లలో ఉన్న సాగు ఈ ఏడాది 502 హెక్టార్లకు పడిపోయింది. నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల పరిధిలోనూ సగానికి విస్తీర్ణం తగ్గింది.

దీనికి తోడు చలి తీవ్రత కారణంగా మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో బూడిద తెగులు సోకడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో మదనపల్లిలోనే టమాటాకు మంచి రేటు లభిస్తోంది. అక్కడే కిలో రూ.30 పలుకుతోంది. దీంతో రాష్ట్రానికి దిగుమతి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని కోలార్, చింతమణి ప్రాంతాల నుంచి టమాటా రాష్ట్రానికి వస్తుంది. అయితే ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడం, భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గింది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతింది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగు మతి చేసుకుంటుండటంతో.. డిమాండ్‌ పెరిగి, తెలంగాణకు టమాటా సరఫరా తగ్గిపోయింది.

నిన్న మొన్నటి వరకు బోయిన్‌పల్లి మార్కెట్‌కే 2,500 క్విం టాళ్ల మేర టమాటా సరఫరా కాగా, శుక్రవారం 1,380 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గత వారం హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో టమాటా రూ.5 నుంచి రూ.6 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.30 వరకు పలుకుతోంది. దీన్ని మార్కెట్‌లో వ్యాపారులు రూ.2 నుంచి రూ.5 వరకు కలిపి రూ.35 వరకు అమ్ముతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మున్ముందు ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గతేడాది ఇదే రోజున టమాటా కిలో ధర 6 రూపాయలు పలికింది. 

మిగతా కూరగాయల్లోనూ అంతే
చీక్యాప్సికం, వంకాయ, కాకర, బెండ, దొండ ధరల్లోనూ పెరుగుదల ఉంది. వీటి ధర రెండింతల మేర పెరిగింది. క్యాప్సికం ధర ప్రస్తుతం కిలో రూ.35 నుంచి రూ.40 మధ్య పలుకుతోంది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ నుంచి దిగుమతులు తగ్గాయి. అనంతపురం నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే వంకాయకు డిమాండ్‌ పెరగడంతో దీని ధర కిలో రూ.40కి చేరింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మహారాష్ట్ర నుంచి రావాల్సిన కాకర దిగుమతులు తగ్గడంతో దీని ధర కిలో రూ.30 నుంచి రూ.45కి చేరింది. బెండ రూ.40, దొండ రూ.35కి చేరింది.

>
మరిన్ని వార్తలు