కాళేశ్వరం.. టార్గెట్‌ ఖరీఫ్‌!

17 Dec, 2018 03:24 IST|Sakshi

వచ్చే జూన్‌ నాటికి మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపు

ఇదే లక్ష్యంగా పనులపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం.. 

రేపు కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల సందర్శన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి వరప్రదాయనిగా ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఖరీఫ్‌ ఆయకట్టుకు నీళ్లిచ్చేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జూన్‌లో వర్షాలు మొదలై గోదావరిలో నీటి ప్రవాహాలు ఉధృతమయ్యేనాటికి ప్రధాన పనులన్నింటినీ పూర్తిచేసి మిడ్‌మానేరు వరకు నీటిని తరలించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను పూర్తి చేసి కనిష్టంగా 90 టీఎంసీల నీటినైనా ఎల్లంపల్లికి అటు నుంచి మిడ్‌మానేరుకు తరలించే ప్రణాళికలో భాగంగానే మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. సరిగ్గా కిందటేడాది ఆగస్టు 7, 8 తేదీల్లో కాళేశ్వరం పనులను కేసీఆర్‌ పరిశీలించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు ఉన్న మూడు ప్యాకేజీల పనులు ఆశాజనకంగా ఉన్నా.. ఎగువన బ్యారేజీ, పంప్‌హౌస్‌ పనులపై అసంతృప్తి ఉండటంతో స్వయంగా వాటిని పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు మార్గదర్శనం చేయనున్నారు. 
ఈ ఖరీఫ్‌కు ఎత్తిపోయాల్సిందే...
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు పంప్‌హౌస్‌ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో తొలి నుంచి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీనికితోడు ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో గోదావరికి వచ్చిన వరద కారణంగా పనులు పూర్తిగా నిలిచాయి. దీంతో ఇక్కడ మొత్తంగా 85 గేట్లు అమర్చాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే 6 గేట్లను మాత్రమే అమర్చారు. మిగతాగేట్లు అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది.

ఇక్కడ ప్రస్తుతం రోజుకు 3,500 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పని జరుగుతోంది. ఇది 6 వేల నుంచి 7 వేల క్యూబిక్‌ మీటర్లకు చేరితే కానీ మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 11 మోటార్లకు ఇప్పటివరకు 4 మోటార్లు అమర్చారు. మిగతావాటిని అమర్చే ప్రక్రియ వేగిరం చేయాల్సి ఉంది. అన్నారం బ్యారేజీలో 66 గేట్లు, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తయింది. వీటి పంప్‌హౌస్‌లలో మాత్రం మోటార్లు అమర్చే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అన్నారం పంప్‌హౌస్‌లో 8 మోటార్లకు 2, సుందిళ్ల పంప్‌హౌస్‌లో 9కి 2 మోటార్లు అమర్చారు. ఇక్కడి పనులపై శనివారంనాటి సమీక్షలో ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌కు ముందే ఈ పనులన్నింటినీ పూర్తి చేసి ఎల్లంపల్లికి నీటిని తరలించాలని కేసీఆర్‌ లక్ష్యంగా నిర్ణయించారు.

ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరుకు నీటి తరలింపు పనులను మూడు ప్యాకేజీలు (6, 7, 8)గా విభజించగా, ఇందులో ప్యాకేజీ–6, 7లో మూడేసి పంపులను సిద్ధం చేశారు. వాటి డ్రైరన్‌ సైతంపూర్తయింది. ప్యాకేజీ–7లో టన్నెల్‌ పనులు పూర్తయినా, లైనింగ్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. వీటిని జూన్‌ నాటికి సిద్ధం చేస్తే కనీసంగా ఎల్లంపల్లి నుంచి 90 టీఎంసీల నీటిని మిడ్‌మానేరుకు తరలించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యంగా ఉంది. మిడ్‌ మానేరులో కనీసమట్టాలకు నీరు చేరిన వెంటనే దిగువ ప్యాకేజీల ద్వారా మల్లన్నసాగర్‌ కాల్వలకు నీటిని తరలించేదిశగా కేసీఆర్‌ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యాచరణ పక్కాగా అమల్లోకి తెచ్చేందుకు ప్రతిపనికి నిర్ధిష్ట గడువును విధించి, పనులు పూర్తిచేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు తన పర్యటనలో మార్గదర్శనం చేయనున్నారు. 

సీతారామ, పునరుజ్జీవం, పాలమూరుపైనా..
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులపైనా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడి 3 పంప్‌హౌస్‌ల పరిధిలో 3.98 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపనికిగాను 29.52 లక్షల మట్టిపని పూర్తయినా, 5.1 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనిలో కేవలం 3.04 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిమాత్రమే పూర్తయింది. మరో 2.06 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని మిగిలి ఉంది. ఈ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సంబంధిత ఏజెన్సీపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ 24 మోటార్లకు 15, 24 మోటార్లకు 10 మోటార్లను మాత్రమే కొనుగోలు చేశారు. దీనిపైనా శనివారంనాటి సమీక్ష నుంచే ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ, పాలమూరు–రంగారెడ్డి పరిధిలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు పనుల్లో వేగం పెంచాల్సి ఉన్న దృష్ట్యా ఈ ప్రాజెక్టులపై త్వరలోనే పూర్తిస్థాయి సమీక్షతోపాటు ప్రాజెక్టుల పరిధిలోనూ పర్యటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు