సామూహిక సెలవులకు వెళ్దామా?

5 Jul, 2019 03:08 IST|Sakshi

రెవెన్యూ శాఖలో తర్జనభర్జన

అన్ని కేడర్లలో బదిలీలు, పదోన్నతులు, శాఖ ప్రక్షాళనపై తీవ్ర అసంతృప్తి

ఉద్యోగుల ఒత్తిడితో సంఘాల ఉక్కిరిబిక్కిరి

తహసీల్దార్ల బదిలీలను తేల్చని ప్రభుత్వం

ఏపీలో పాత జిల్లాలకు పంపుతూ ఉత్తర్వులు

రాష్ట్రంలో వీడని అనిశ్చితి..సీఎం పేషీలో పెండింగ్‌లోనే ఫైలు  

సాక్షి, హైదరాబాద్‌: కోడ్‌ కూత ముగిసినా.. సర్కారు కరుణిం చడంలేదు. తహసీల్దార్లు కుటుంబ సభ్యులను వదిలి పది నెలలైనా పాత జిల్లాలకు తిరిగి పంపేందుకు అంగీకరించడంలేదు. నేడో, రేపో బదిలీ ఉత్తర్వులు అందుతాయని దాటవేస్తూ వచ్చిన రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. తహసీల్దార్ల బదిలీల మాట అటుంచితే అన్ని కేడర్లలోనూ బదిలీలు, పదోన్నతులతోపాటు రెవెన్యూశాఖ ప్రక్షాళనపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సామూహిక సెలవుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సామూహిక సెలవులకు వెళ్దామని ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అర్థంగాక రెవెన్యూ సంఘాలు తర్జనభర్జన పడుతున్నాయి.

ఉంటాయా... ఉండవా?
సొంత జిల్లాలో పనిచేస్తున్న లేదా మూడేళ్లుగా ఒకే జిల్లాలో పోస్టింగ్‌ నిర్వర్తిస్తున్న తహసీల్దార్లను ఎన్నికల కోడ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. ఎన్నికల నియమావళి ముగిసిన అనంతరం వారికి తిరిగి పాత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అలాగే ఉంటుందని భావించిన తహసీల్దార్లు.. వారి కుటుంబ సభ్యులను పూర్వ జిల్లాల్లోనే ఉంచేసి పొరుగు జిల్లాల్లో సేవలందించేందుకు వెళ్లారు. ఎన్నికలు అయిపోగానే వెనక్కి వస్తామనే భరోసాతో పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా వారిని అక్కడే కొనసాగించారు. మే నెలాఖరులో కోడ్‌ ముగియడంతో ఇక పాత జిల్లాలకు వెళ్తామని భావించారు. ఈ మేరకు బదిలీ ఉత్తర్వుల గురించి ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాకపోవడంతో తహసీల్దార్లలో ఆందోళన మొదలైంది. బదిలీలు ఉంటాయా లేదా అనే అనుమానం వారిని తొలిచేస్తోంది.

సీఎంఓ చుట్టూ చక్కర్లు..?
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిధిలోనే రెవెన్యూశాఖ కూడా ఉండటంతో బదిలీలపై సీఎం నిర్ణయం తీసుకుంటే కానీ ముందడుగు వేసే పరిస్థితి కనిపించడంలేదు. ఎన్నికల వేళ వివిధ జిల్లాలకు బదిలీ అయిన 466 మందిని తిరిగి పూర్వ జిల్లాలకు పంపాలని ప్రతిపాదిస్తూ సీఎం పేషీకి చేరిన ఫైలుకు ఇప్పటివరకు మోక్షం కలగకపోవడంతో తహసీల్దార్లు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచిపోయాయి. మరో పక్షం రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఆలోగా గనుక బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోతే తమ పరిస్థితేంటనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు బదిలీల వ్యవహారం రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు తలనొప్పిగా పరిణమించింది. రొటీన్‌గా జరిగే ఎన్నికల బదిలీల ఉత్తర్వులను కూడా ఇప్పించలేకపోయామనే ప్రచారం జరుగుతుండటంతో పరిస్థితిని అధిగమించేందుకు భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే సీఎంఓ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు తాజాగా ఏపీలో ఎన్నికల వేళ స్థానచలనం జరిగిన తహసీల్దార్లను పాత జిల్లాలకు పంపుతూ గురువారం ఉత్తర్వులు వెలువడటం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో బదిలీలపై నిర్ణయం తీసుకోకపోతే సామూహిక సెలవులపై వెళ్లాలని భావిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగ సంఘం నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.  

మరిన్ని వార్తలు