Income, Caste Certificate Guidelines AP: కుల ధ్రువీకరణ పత్రం ఇక శాశ్వతం

12 Oct, 2023 02:12 IST|Sakshi

ఒకసారి తీసుకుంటే చాలు.. ఎప్పుడైనా చెల్లుబాటు

ప్రభుత్వ శాఖలు మళ్లీమళ్లీ అడగకూడదు

ఆదాయ ధ్రువీకరణ కోసం 6 దశల నిర్ధారణ మాత్రమే.. సర్టిఫికెట్‌ కోసం విద్యా సంస్థలు విద్యార్థులను ఒత్తిడి చేయొద్దు

మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

ప్రజల ఇబ్బందులకు చెక్‌.. ఏటా 1.20 కోట్ల సర్టిఫికెట్లు జారీ చేస్తున్న రెవెన్యూ శాఖ

తాజా విధానంతో 95 శాతం తగ్గే అవకాశం

సాక్షి, అమరావతి: ప్రజలు కుల, ఆదాయ ధ్రువీ­కరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వారికి మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తే దాన్ని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు.. విద్యార్థులు, లబ్ధిదారులను ఒత్తిడి చేయొద్దని స్పష్టమైన ఆదే­శాలు ఇచ్చింది. ఆదాయ ధ్రువీకరణకు గ్రామ సచి­వా­లయాల్లోనే ఆరు దశల తనిఖీ సరిపోతుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవ­సరం లేకుండా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. డిజీ లాకర్లలో సర్టిఫికెట్లు కులం, స్థానికత, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల నిబంధనలకు సంబంధించి జీవో ఎంఎస్‌ నంబర్‌ 469, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి జీవో ఎంఎస్‌ నంబర్‌ 484ను తాజాగా విడుదల చేసింది.

ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి పలు మార్గదర్శకాలు ఇచ్చింది. వాటికి సంబంధించి అన్ని శాఖలకు త్వరలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఏటా కుల, ఆదాయ ధ్రువీకరణకు సంబంధించి 1.20 కోట్ల సర్టిఫికెట్లను రెవెన్యూ శాఖ జారీ చేస్తోంది. కొత్త నిబంధనలతో 95 శాతం సర్టిఫికెట్ల జారీ తగ్గిపోనుంది. 

ప్రభుత్వ శాఖలు మళ్లీ మళ్లీ అడగకూడదు.. 
సంక్షేమ పథకాల కోసం వచ్చే లబ్ధిదారులను ఆయా ప్రభుత్వ శాఖలు తాజా కుల ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు వాటికోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. గతేడాది 52 లక్షల కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 42 లక్షలకుపైగా పత్రాలు అందజేశారు.

వాటికి సంబంధించిన డేటా బేస్‌ మొత్తం మీసేవ, ఏపీ సేవ కేంద్రాల్లో ఉంది. వాటిద్వారా ఈ సర్టిఫికెట్లను ఎలాంటి విచారణ లేకుండా మళ్లీ జారీ చేసేలా కొత్త నిబంధనలు రూపొందించారు. వీటి ప్రకారం.. ఒకసారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఎప్పుడైనా చెల్లుబాటవుతుంది. లబ్ధిదారుడు గతంలో జారీ చేసిన సర్టిఫికెట్‌ సమర్పించినప్పుడు ప్రభుత్వ శాఖలు మళ్లీ తాజా సర్టిఫికెట్‌ను అడగకూడదు.

అలాగే మీసేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందిన వారికి  ఎ–కేటగిరీ సేవగా తక్షణమే తాజా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. వారి కుల నిర్ధారణ కోసం తహశీల్దార్, ఇతర అధికారులు దానిపై మళ్లీ విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ లబ్ధిదారుడి తండ్రి, సోదరులు ఎవరైనా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొంది ఉంటే వారి బంధుత్వాన్ని పౌరసరఫరాల శాఖ డేటాబేస్‌ ద్వారా నిర్ధారించుకుని ఈకేవైసీ పూర్తయితే విచారణ లేకుండా వెంటనే సర్టిఫికెట్‌ జారీ చేయాలి.

ఈకేవైసీ పెండింగ్‌లో ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్‌ అందించాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం ప్రస్తుత విధానంలోనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

ఆదాయ ధ్రువీకరణకు ఆరు దశల నిర్ధారణే
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి (బీపీఎల్‌) గురించి తెలుసుకోవడానికి, విద్యా సంస్థల్లో స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాలు, ఫీజు మినహాయింపులు పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది. గత రెండేళ్లలో 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వీటికోసం రెవెన్యూ అధికారులు ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆయా శాఖలకు తాజాగా స్పష్టం చేసింది.

సంక్షేమ, విద్యా, ఇతర శాఖలు తమ పథకాల అమలుకు సంబంధించి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఇందుకు వినియోగించుకోవాలి. ఒకవేళ అందులో దరఖాస్తుదారులు ఎంపిక కాకపోతే ఆ శాఖలు సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. పది, ఇంటర్‌ విద్యార్థుల డేటాబేస్‌ను విద్యా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాలకు పంపితే అక్కడ 6 దశల నిర్ధారణ ప్రక్రియతో వారి ఆదాయ స్థాయిని నిర్ధారిస్తారు.

ఒకవేళ అక్కడ విద్యార్థులు అర్హత సాధించకపోతే ఆ వివరాలను ఆయా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. రెవెన్యూ శాఖ విచారణ చేసి వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. స్కాలర్‌షిప్‌లు, పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు ఆరు దశల నిర్ధారణ ప్రక్రియ సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం జారీ చేసే సర్టిఫికెట్లకు కూడా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి.

   

మరిన్ని వార్తలు