ట్రా‘వెల్‌’ చేయండిలా..

25 Jan, 2019 11:12 IST|Sakshi

టూర్లకు ప్రణాళిక అవసరం ఇన్సూరెన్స్‌ ఆవశ్యం  

సూచిస్తున్న పర్యాటకరంగ నిపుణులు  

సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఏటా రెట్టింపవుతోంది. అయితే టూర్లకు వెళ్లాలనే సరదానే తప్ప... ముందస్తుగా తగిన ప్రణాళిక లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నగరానికి చెందిన పర్యాటక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ మంచి పరిష్కారమని చెబుతున్నారు. విద్య, వ్యాపారం, వ్యక్తిగతం మరెన్నో అవసరాలతో ప్రయాణం అనేది తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం దాదాపు 5కోట్ల మంది ప్రయాణికులతో భారతీయ పర్యాటక పరిశ్రమ రానున్న 2020 వరకు రూ.28 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటుందని అంచనా. 

ఫ్లైట్స్‌ లేట్‌.. లగేజీ మిస్‌   
జర్నీ సమయంలో పాస్‌పోర్టు పోగొట్టుకోవడం, ఫ్లైట్స్‌ మిస్సవడం లేదా ఆలస్యం కావడం, లగేజీ పోగొట్టుకోవడం, ట్రిప్స్‌ క్యాన్సిల్‌ కావడం, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు... ఇలా ఎన్నో ఇబ్బందులు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై ముందస్తుగా సంసిద్ధత లేకపోతే ఎన్నో వ్యయప్రయాసలు, ఆర్థిక నష్టాలు తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2016లో విమాన ప్రయాణికులు 2.16 కోట్లకు పైగా బ్యాగ్స్‌ పోగొట్టుకున్న కేసులు నమోదయ్యాయి. మన దేశంలో అయితే  ప్రతి వెయ్యి మందిలో ఏడుగురు పోగొట్టుకుంటున్నారని 2014లో ఓ నివేదిక పేర్కొంది. ఇలా దుస్తులు, మందులు తదితర లగేజీ పోగొట్టుకోవడం మరిన్ని వ్యయప్రయాసలకు కారణమవుతోంది. ఇక ఫ్లైట్స్‌ ఆలస్యంగా రావడమో, రద్దు కావడమో జరిగితే మరిన్ని సమస్యలు తప్పడం లేదు. 

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి...  
అత్యవసర పరిస్థితుల్లో ఉపకరించేలా పర్యాటకులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి వచ్చింది. కేవలం వైద్యపరమైన అంశాలకు మాత్రమే కాకుండా ఇతరత్రా అవసరాలకు కూడా బీమా సౌకర్యం అందుబాటులో ఉందనే విషయంపై నగరవాసుల్లో చాలా మందికి అవగాహన లేదు. వీటిలో నాన్‌ మెడికల్‌ వ్యక్తిగత అనిశ్చిత పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రవాద చర్యలు తదితర అనేక రకాల ఎమర్జెన్సీ పరిస్థితుల నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24/7 సేవలు సైతం బీమా కంపెనీలు అందిస్తున్నాయి. ఒక పరిశోధన ప్రకారం కేవలం 40శాతం మంది మాత్రమే ఈ తరహా ఇన్సూరెన్స్‌కి ప్రాధాన్యతనిస్తున్నారని తేలింది. ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఫ్లైట్‌ మిస్సవడం తరహా నష్టాలకు కూడా భధ్రత కల్పిస్తున్నాయి. లగేజీ నష్టాలకు రూ.77వేల వరకు, ఫ్లైట్‌ ఆలస్యం లేదా క్యాన్సిలేషన్‌లకు రూ.1.12 లక్షల వరకూ బీమా కవరేజ్‌ లభిస్తోంది. 

విదేశీ వైద్యం వ్యయభరితం...  
ఇక వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు రక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింగపూర్, కెనడా, హాంకాంగ్, అమెరికా లాంటి దేశాల్లో వైద్య సేవలు చాలా ఖరీదు. ఒక్క రోజు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చినా రూ.లక్షల్లో వెచ్చించాల్సిందే. రూ.69లక్షల నుంచి రూ.1.38కోట్ల వరకు విలువైన వైద్య బీమాలను కంపెనీలు అందిస్తున్నాయి. రాజకీయపరమైన ప్రమాదాలు, ఎమర్జెన్సీ హోటల్‌ ఎక్స్‌టెన్షన్, పెద్దవాళ్లు ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాలేకపోతే పిల్లలు మాత్రమే తిరిగి రావడానికి కావల్సిన ఏర్పాట్లు, జీవనశైలి అవసరాలు ఇలా విభిన్న రకాలుగా ముందస్తు బీమా అందుతోంది. ‘వీసా కోసం మాత్రమే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అనుకుంటున్నారే తప్ప, అది తమకు అత్యవసరమైందని 38శాతం మంది అనుకోవడం లేదని ఓ సర్వేలో తేలింది. అయితే అది సరైన అవగాహన కాదు. మన ప్రయాణం పూర్తి సురక్షితంగా మార్చడానికి ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి అని అర్థం చేసుకోవాలి’ అని రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సీఈఓ రాకేశ్‌జైన్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు