సీపీఐ మద్దతు కోరిన టీఆర్‌ఎస్‌

29 Sep, 2019 16:47 IST|Sakshi

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో మద్దతు కోరిన టీఆర్‌ఎస్‌

త్వరలోనే ప్రకటిస్తామన్న సీపీఐ

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను తెలంగాణ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్యనే ఉన్నప్పటికీ బరిలో నిలిచేందుకు అన్ని రాజకీయ పక్షాలు పోటీపడుతున్నాయి. అయితే గెలుపు కోసం అధికార టీఆర్‌ఎస్‌ పదునైన వ్యూహాలను రచిస్తోంది. దీనిలో భాగంగానే సీపీఐ మద్దతును కోరింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, వినోద్‌ కుమార్‌లు  ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో చాడా వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తాము ఇక్కడి వచ్చినట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తెలిపారు.

వారి రాకను స్వాగతించిన చాడ వెంకట్‌రెడ్డి.. మంగళవారం జరిగే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అనంతరం తమ నిర్ణయం తెలుపతామని ప్రకటించారు. యూరేనియం విషయంలో సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర అభివృద్ధే తమ లక్క్ష్యమని చాడా అభిప్రాయపడ్డారు. కాగా ప్రధాన పోటీదారులపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ, టీడీపీ కూడా అభ్యర్థులను బరిలో నిలిపాయి. సీపీఎం కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. దీంతో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఉ‍త్కంఠగా మారింది.

మరిన్ని వార్తలు