కోర్‌ కమిటీదే ఎంపిక బాధ్యత 

17 Apr, 2019 11:24 IST|Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ అధిష్టానం మండలానికి ఒక కోర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుండటంతో అన్ని పార్టీల్లో అలజడి మొదలైంది. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడానికి క్షేత్రస్థాయిలో కమిటీ అవసరం అని అధిష్టానం భావించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షునితో పాటు సీనియర్‌ నాయకులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

కోర్‌ కమిటీ సభ్యులు అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులతో సమావేశాలను నిర్వహించి ఎంపీటీసీ అభ్యర్థుల ఆశావహుల పేర్లను సేకరించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి జెడ్పీటీసీ అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులను గెలిపించాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సి ఉంది.

జిల్లాలో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ జిల్లా అంతటిని అజమాయిషీ చేసే బాధ్యతను మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఇచ్చారు. కోర్‌ కమిటీ సభ్యులు ఆశావహుల జాబితాలను తయారు చేసి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించాల్సి ఉంది. ఎమ్మెల్యేలే అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపనున్నారు. కోర్‌ కమిటీ సభ్యుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో వారు రెండు మూడు రోజుల్లో ఆశావహుల జాబితాలను తయారు చేయడానికి గ్రామాల వారీగా సమావేశాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే కోర్‌ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు తీవ్రంగానే ఉందని స్పష్టం అవుతుంది.

మరిన్ని వార్తలు