అమ్మకు అభయం

14 Feb, 2018 15:54 IST|Sakshi
గర్భిణులు, బాలింతల కోసం ఏర్పాటు చేసిన 102 వాహనం 

గర్భిణులు, తల్లీబిడ్డల కోసం అమ్మఒడి పథకం

జిల్లాకు 14 వాహనాలు కేటాయింపు

102 నంబర్‌కు ఫోన్‌ చేస్తేచాలు వైద్య సేవలు

సుఖప్రసవాలను ప్రోత్సహించేందుకే..

డెలివరీ అయిన మూడు నెలల వరకూ వినియోగించుకోవచ్చు

పటాన్‌చెరు టౌన్‌: మాతా శిశు సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ పథకం కొనసాగుతుండగా గర్భిణులకు మరిన్ని సేవలందిస్తూ తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడేందుకు 108 తరహాలో 102 నంబర్‌తో ‘అమ్మఒడి’ పేరిట వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాలు అమ్మకు ఆత్మీయత, బిడ్డకు ప్రేమను పంచుతున్నాయి. మొదటి విడతగా జిల్లాకు ఇప్పటికే 14 వాహనాలు రాగా నియోజకవర్గానికి రెండు చొప్పున కేటాయించారు.

ఒక్క ఫోన్‌కాల్‌తో..
మారుమూల గ్రామాల నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు సైతం లేని దుస్థితిలో ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారు. తల్లీ బిడ్డలకే కాకుండా గర్భిణులకు వైద్యం అవసరమైతే 102 నంబర్‌కు పోన్‌ చేస్తే చాలు. ఇంటికి వచ్చి వాహనంలో వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఇంటి వద్దకు చేరవేస్తారు. జిల్లాలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలు, సంగారెడ్డిలో జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. జిల్లా పరిధిలో ఏఏ ఆస్పత్రిలో ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయో గుర్తించి ఆ ప్రాంతాలకు నూతనంగా వచ్చిన వాహనాలను కేటాయించారు. నారాయణఖేడ్‌కు 4, సంగారెడ్డికి 3 మూడు, మిగతా నియోజకవర్గాలకు రెండు చొప్పున వాహనాలు చేరాయి.  

సేవలు ఇలా..

  • గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవానంతరం పుట్టిన చిన్నారికి మూడు నెలలు వచ్చేంత వరకు సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది.
  • గర్భిణులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా 102 వాహనానికి సమాచారం అందించి సేవలు వినియోగించుకోవచ్చు.
  • గర్భిణి ఇంటి వద్దకు వచ్చి 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. వైద్యసేవలు అందించిన తర్వాత తిరిగి ఇంటికి చేరుస్తారు.
  • డెలివరీ అయిన మూడు నెలల వర కు కూడా ఈ 102 వాహనం సేవలు వినియోగించునే అవకాశం ఉంది. 
  • 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే తరలిస్తారు.ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించరు.
  • ప్రయాణం మధ్యలో గర్భిణులు, బాలింతలకు అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే 108 వాహనానికి సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలిస్తారు.

వాహనాల సేవలు వినియోగించుకోవాలి
జిల్లాకు 102 వాహనాలు 14 వచ్చాయి. వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాల్లో గర్భిణులను సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.              
– సురేష్‌ 102,108,1962 వాహనాల జిల్లా కోఆర్డినేటర్‌

మరిన్ని వార్తలు