వేలం పాటలు మొదలయ్యాయి!

29 Oct, 2023 04:25 IST|Sakshi

అభిప్రాయం

ఎన్నికల సీజన్‌ మొదలవడంతో, మళ్లీ మేనిఫెస్టోలను రూపొందించే పనిలో అన్ని రాజకీయ పార్టీలూ తలము నకలు అవుతున్నాయి. మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు అవి అధి కారంలోకి వచ్చిన తరువాత చేయగల పనులను పేర్కొనే హామీ పత్రం. మేనిఫెస్టోను నమ్మే చాలా మంది ఓట్లు వేస్తూ ఉంటారు. కాని, చాలా రాజ కీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోను మరచిపోయి ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తాయి. ఎక్కడో ఒకటో ఆరో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలాంటివి మాత్రం మేని ఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌ల వంటి పవిత్ర గ్రంథాలుగా భావిస్తున్నాయి. ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాయి. 

మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించటం ప్రతి పార్టీ చేసే పనే. అయితే వాటిని చిత్తశుద్ధితో ఎంత వరకు అమలు చేశారు అనేది ముఖ్యం, చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా విజయవంతమవుతుంది. తద్వారా ప్రజలకు మేలు కలిగి పాల కులు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఒకప్పుడు ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ తన మేనిఫెస్టోలో పొందు పరిచి, చిత్తశుద్ధితో అమలు పరిచిన నందమూరి తారక రామా రావు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈ పథకం పేరు చెప్పగానే ఆయనే గుర్తుకు వస్తారు.

అలాగే ప్రజల ఆరోగ్యం కోసం ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని రూపొందించిన డా‘‘  వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీనే గుర్తుకు వస్తుంది. అదేవిధంగా పేద పిల్లల చదువుల కోసం అహర్నిశలూ పాటు పడుతున్న నేటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేరు చెప్పగానే ‘అమ్మ ఒడి’ గుర్తుకొస్తుంది. పేదవాడి సంక్షేమం గురించి చిత్తశుద్ధితో ఆలోచించి అమలు పరిచే పథకాలకు ఎప్పటికీ మరణం ఉండదు. అందుకనే ఆ పథకాలూ, వాటిని అమలు పరిచిన నాయకులు చిరస్మరణీయం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఆ పథకాలను మాత్రం మార్చలేని పరిస్థితికి పార్టీలు వచ్చాయి అంటే అవి ఎంతగా ప్రజలకు మేలు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ‘మేము అధికారంలోకి వస్తే కొనసాగిస్తాము’ అని ప్రతిపక్షాలు ప్రజలకు హామీ ఇస్తున్నాయి అంటే ఆ పథకాలు ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల పక్క రాష్ట్రంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మెచ్చి ప్రజలు అక్కడ ఒక రాజకీయ పార్టీకి అధికారం కట్ట బెట్టడంతో, అవే హామీలను తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాయి. పొందు పరచడమేకాక ఒకరు వంద ఇస్తానంటే మరొకరు రెండు వందలు ఇస్తాం అంటూ వేలం పాటలు మొదలు పెట్టారు. వెయ్యి రూపాయలు ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ పై ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు వందలు తగ్గించింది.  అంటే ఏడు వందలకే ఇస్తుందన్నమాట.

ఇది చూసి మరో రెండు వందలు తగ్గించి, ఐదు వందలకే ఇస్తామని మరో పార్టీ ప్రకటిస్తే, ఇంకో పార్టీ నాలుగొందలకే ఇస్తామని ప్రకటించింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను ఒక పార్టీ మూడు వేలు అంటే... మరో పార్టీ ఐదు వేలు అంటోంది. ఇలా వేలం పాటల్లో ఇచ్చే హామీలను అధికారం వచ్చిన తరువాత గాలికి వదిలేస్తారు అనటంలో ఏ సందేహం లేదు. మేనిఫెస్టోలో ప్రకటించే సంక్షేమ పథకాలకూ, ఉచిత పథకాలకూ ఉన్న తేడా ప్రజలు గుర్తించాలి. 

ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి కొన్ని రాజకీయ పార్టీలు గ్యారంటీ నినాదాన్ని అందుకున్నాయి. కొంత మంది భవిష్యత్తుకు గ్యారంటీ అంటే మరి కొంతమంది ‘ఆరు స్కీముల’ గ్యారంటీ అంటూ ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. ఒకప్పుడు ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవటంతో గ్యారంటీ స్కీములతో ముందుకొచ్చారిప్పుడు ప్రజలను నమ్మించ టానికి! మరికొంత మంది ఇంటింటికీ తిరిగి, తమ స్కీముల వల్ల ఎంత లబ్ధి చేకూరుతుందో అంత మొత్తానికి ‘బాండ్లు’ రాసిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లే!

చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను అమలు చేసే వాళ్ళనే ప్రజలు నమ్ముతారు. ప్రజల నమ్మకం ముందు ఈ గ్యారంటీలు, బాండ్లు ఎందుకూ కొరగావు. ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. కొన్నిసార్లు ఇచ్చిన హామీల్లో ఒకటో, రెండో అమలు చేయడం సాధ్యం కాదు. అలాంట ప్పుడు నిజాయతీగా ఎందుకు అమలు చేయలేక పోతున్నదీ ప్రజలకు వివరిస్తే అర్థం చేసుకుంటారు. అలా కాకుండా ఉత్తుత్తి హామీలు ఎన్ని ఇచ్చినా ఏ ఉపయోగమూ ఉండదు!

ఈదర శ్రీనివాస రెడ్డి 
వ్యాసకర్త నాగార్జున యూనివర్సిటీ
ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ 

మరిన్ని వార్తలు