‘ఆధారాలు చూపిస్తే ఉత్తమ్‌కే రాసిస్తా’

16 Jun, 2017 15:42 IST|Sakshi
‘ఆధారాలు చూపిస్తే ఉత్తమ్‌కే రాసిస్తా’

హైదరాబాద్‌: పార్టీ మారినందుకు నజరానాగా హఫీజ్‌పేట్‌లో తమకు భూమి ఇచ్చారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనడం అవాస్తవమని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నాయకుడు రెడ్యానాయక్‌ అన్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరామనే దుగ్ధతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉత్తమ్‌ కంటే సీనియర్ అయిన తనపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదన్నారు.

2006 జనవరిలో సర్వే నెం.80లో భూమి కొన్నామని, 2008లో విక్రయించామని, అవి పూర్తిగా ప్రైవేటు భూములని, అప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నానని వివరించారు. తాను టీఆర్ఎస్‌లో చేరాక ఒక్క సెంటు భూమి కొన్నానని ఆధారాలు చూపిస్తే అది ఉత్తమ్‌కే రాసిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కారులో నగదు దొరికినా ఉత్తమ్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని, అవన్నీ న్యాయంగా సంపాదించినవేనా అని ప్రశ్నించారు.

ఉత్తమ్‌కు విజ్ఞత ఉంటే తనకు, తమ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రంలోని గిరిజనులు క్షమించరన్నారు. మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. అందులో ఆకట్టుకునే నాయకుడే లేడంటూ తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని రెడ్యా చెప్పారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు