పారని ‘తారక’ మంత్రాంగం

3 Oct, 2018 11:52 IST|Sakshi
మాలోతు కవిత, సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: అసమ్మతి నేతలు అదే పట్టు మీదున్నారు. బరిలో నిలబడి తీరుతాం అని తెగేసి చెప్పారు. ‘నిండా ముంచినాక ఇంకా అధిష్టానం ఏమిటి? మా కార్యకర్తల మాటే శిరోధార్యం’ అని కరాఖండీగా చెబుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, యువరాజు కేటీఆర్‌ మంగళవారం మరికొంత మంది వరంగల్‌ అసమ్మతి నేతలను ప్రగతి భవన్‌కు పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ తరహాలోనే సీన్‌ రిపీట్‌ అయ్యింది. కేటీఆర్‌ చేసిన సంప్రదింపులు అర్ధంతరంగానే ముగిసినట్లు తెలిసింది.  భవిష్యత్‌లో సముచిత స్థానం ఇస్తామని, ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్న కేటీఆర్‌ విజ్ఞప్తిని అసమ్మతి నేతలు తోసిపుచ్చినట్లు సమాచారం. దీంతో మరోమారు కేసీఆర్‌తో కలిసి మాట్లాడుకుందామని కేటీఆర్‌ కోరినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

     అసమ్మతిని సర్దుబాటు చేసేందుకు కేటీఆర్‌ రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్‌ అసమ్మతి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు తకెళ్లిపల్లి రవీందర్‌రావు, డోర్నకల్‌ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితను చర్చలకు ఆహ్వానించి.. వారితో వేర్వేరుగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ వెంటే ఉన్న తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పాలకుర్తి నియోజకర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి రావడంతో ఈసారి టికెట్‌ ఆయనకు కేటాయించారు. కేసీఆర్‌ నిర్ణయంతో తక్కెళ్లపల్లి విభేదించారు. పార్టీ అభ్యర్థిపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇండిపెండెంటుగా బరిలోకి దిగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఆయనను రాజీకి పిలిచారు.

దాదాపు 40 నిమిషాలపాటు కేటీఆర్‌తో మాట్లాడిన తక్కెళ్లపల్లి తన గోడు మొత్తం వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తనకు అన్యాయం చేసిందనిచెప్పినట్లు సమాచారం. ఆయన చెప్పింది అంతా విన్నా కేటీఆర్‌ భవిష్యత్‌లో సముచిత స్థానం ఇస్తామని, ఎన్నికల్లో కలిసి పనిచేయాలని కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు సమ్మతించని రవీందర్‌రావు ఇండిపెండెంటుగానైనా పోటీచేయాలని కార్యకర్తలు తనపై ఒత్తిడి  తెస్తున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ల మాట కాదనలేనని చెప్పినట్లు తెలిసింది. దీంతో కేటీఆర్‌ కల్పించుకుని మీరు చెప్పిన అంశాలను నాన్నగారికి (కేసీఆర్‌) దృష్టికి తీసుకెళ్తాను, మరో రెండు రోజుల్లో మళ్లీ పిలుస్తామని చెప్పి పంపినట్లు తెలిసింది.

డోర్నకల్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌  పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్‌ ఆమెను చర్చలకు ఆహ్వానించారు. ప్రగతి భవన్‌లో దాదాపు గంట పాటు ఆమెతో చర్చించారు. టీడీపీని, పదవులను, ఆస్తులను త్యాగం చేసిన తనను పక్కన పెట్టి మధ్యలో వచ్చిన వారికి టికెట్‌  ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని ఆమె గట్టిగానే అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకపోతే మాకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేను ఇంతకాలం మౌనంగా ఉన్నాను, కానీ నా అనుచరులు, కార్యకర్తలు ఆగటం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ అధిష్టానం కంటే నా కార్యకర్తల మాటే నాకు శిరోధార్యం అని కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది. సత్యవతిని  కూడా రెండు రోజుల్లో  కేసీఆర్‌తో కలిపిస్తామని చెప్పి పంపినట్లు తెలుస్తోంది.

మహబూబాబాద్‌ టికెట్‌ను ఆశించిన మాలోతు కవితతో మాత్రం చర్చలు కొంతమేరకు సఫలమైనట్లు తెలుస్తోంది.  పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని కేటీఆర్‌ ఇచ్చిన హామీ పట్ల ఆమె కొంత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు రోజుల తర్వాత తన తండి రెడ్యా నాయక్‌తో కలిపి మరోమారు చర్చలకు కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరిన్ని వార్తలు