‘ఉత్తమ్‌ ఆత్మవంచనతో మాట్లాడుతున్నారు’

9 Jul, 2017 19:48 IST|Sakshi

హైదరాబాద్‌సిటీ: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఆత్మవంచనతో మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. టీఆర్‌ఎస్‌భవన్‌లో మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అప్పటికీ ఇప్పటీకీ కాంగ్రెస్ నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వం ఇంకా పోలేదని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టుపై ఉత్తమ్ సమైక్యవాదిలా మాట్లాడారని అన్నారు. పులిచింతలతో తెలంగాణకు ముంపు ఆంధ్రకు సాగు అని చెప్పారు. పులిచింతల వద్దని ఉద్యమ సందర్భంగా గట్టిగా చెప్పామని టీఆర్‌ఎస్‌నేతలు తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టు పనులు ఆంధ్రకు ఉపయోగపడేవి కాబట్టి తొందరగా పూర్తయ్యాయని, హైడల్ ప్రాజెక్టు తెలంగాణకు ఉపయోగం కనుకే ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. జూరాల హైడల్ ప్రాజెక్టును ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనని, దాని ఫలితంగా 250 కోట్లు నష్టపోయామని తెలిపారు. అప్పుడే హైడల్ ప్రాజెక్టులు కట్టి ఉంటే తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో కరెంట్ కొనే అవసరంఉండేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సాగు, కరెంటు కష్టాలకు కాంగ్రెస్సే కారణమన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు ప్రాజెక్టుల మీద మాట్లాడే హక్కు లేదని, కాంగ్రెస్‌ చరిత్ర అంతా తవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు