కారు.. హుషారు

5 Jul, 2014 03:20 IST|Sakshi
కారు.. హుషారు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధిక స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానం, టీడీపీ మూడో స్థానంలో నిలిచాయి. వాగ్వాదం, తోపులాటలు వంటి స్వల్ప ఘటనలు మినహా మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం జరిగిన పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
 
 బిజినేపల్లి, వంగూరు మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసరడంతో ఉద్రిక్తతకు దారితీసింది. 64 మండల పరిషత్‌లకు గాను మూడుచోట్ల ఎన్నిక వాయిదా పడింది. ఏ పార్టీకీ సరిపడినంత సంఖ్యాబలం లేని చోట ప్రలోభాల పర్వం జోరుగా సాగింది.
 
 సభ్యుల ప్రమాణ స్వీకారం, కో ఆప్షన్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నిక ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగడంతో అంతటా ఉత్కంఠ పరిస్థితి కనిపించింది. క్యాంపుల పేరిట మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు చేజారకుండా పార్టీలు, నేతలు కట్టుదిట్టంగా వ్యవహరించినా పలు చోట్ల ఫిరాయింపులు నమోదయ్యాయి. పార్టీలు, సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడంతో ‘కలగూర గంప’ కూటములకు మండల పరిషత్ పీఠాలు దక్కాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ మెజారిటీ మండల పరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది.
 
 జిల్లాలో 64 మండల పరిషత్‌లకు గాను మూడు చోట్ల అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. జడ్చర్లలో కోర్టు కేసు కారణంగా వాయిదా వేయగా, దేవరకద్ర, కొత్తూరులో సమావేశం నిర్వహణకు సరిపడినంతగా సభ్యుల హాజరు (కోరం) లేదనే కారణంతో ఎన్నిక వాయిదా పడింది. జడ్చర్ల మినహా మరో ఐదు మండల పరిషత్‌లలో ఉపాధ్యక్ష ఎన్నిక కూడా వాయిదా పడింది. నర్వ, దేవరకద్ర, కొందుర్గు, కొత్తూరు, ఖిలాఘణపూర్‌లో కోరం లేకపోవడంతో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నిక వాయిదా వేశారు.
 
  మండల పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. 27 చోట్ల ఎంపీపీ అధ్యక్ష పదవులు, 20 ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. మిడ్జిల్‌లో స్వతంత్ర అభ్యర్థి గీతకు టీఆర్‌ఎస్ ప్రాదేశిక సభ్యులు గంపగుత్తగా మద్దతు పలికారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ శిబిరంలోకి ఫిరాయించిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు కృష్ణయ్యకు టీఆర్‌ఎస్ సభ్యులు మద్దతు పలకడంతో ఎంపీపీ పీఠం దక్కింది.
 పలు చోట్ల టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీతో జట్టు కట్టడం ద్వారా కాంగ్రెస్ 19 ఎంపీపీ అధ్యక్ష, 17 ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. టీడీపీ, బీజేపీలు కూడా ఇతర పార్టీలతో జతగూడి వీలైనన్ని మండల పరిషత్ పీఠాలు దక్కించుకున్నాయి. టీఆర్‌ఎస్‌తో జట్టు కట్టడం ద్వారా బిజినేపల్లి మండల పరిషత్ ఉపాధ్య పదవిని సీపీఐ తన ఖాతాలో వేసుకుంది. బల్మూరులో తమకు మద్దతు పలికిన టీడీపీ సభ్యురాలు ఉత్తరమ్మకు ఉపాధ్యక్ష పదవిని టీఆర్‌ఎస్ కట్టబెట్టింది.
 
 బల్మూరులో టీఆర్‌ఎస్- టీడీపీ, కల్వకుర్తిలో కాంగ్రెస్- టీఆర్‌ఎస్, తాడూరులో టీఆర్‌ఎస్- బీజేపీ, తెల్కపల్లిలో బీజేపీ- కాంగ్రెస్, కొడంగల్‌లో టీడీపీ- కాంగ్రెస్, బిజినేపల్లిలో టీఆర్‌ఎస్- సీపీఐ ఇలా విభిన్న కూటములుగా స్థానిక అవసరాల మేరకు పార్టీలు, నేతలు సర్దుబాటు చేసుకున్నారు. సీసీకుంటలో విప్ ధిక్కరించి మండల పరిషత్ అధ్యక్ష పదవిలో టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలు సులోచనమ్మకు ఉపాధ్యక్ష పదవి దక్కింది.
 
 బిజినేపల్లి మండలంలో తమ పార్టీ ఎంపీటీసీ సభ్యుడిని తన వాహనంలో తీసుకెళ్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేశారు.
 
 ఈ ఘటనలో ఎమ్మెల్యే వాహనం పాక్షికంగా దెబ్బతినడంతో దాడికి బాధ్యులను అరెస్టు చేయాలంటూ మర్రి జనార్దన్‌రెడ్డి పోలీసులకు పిర్యాదు చేశారు. వంగూరులో అచ్చంపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ వర్గీయుల నడుమ వాగ్వాదం జరిగింది. తనపై దాడికి కారకులైనా వారిని అరెస్టు చేయాలంటూ ఎమ్మెల్యే పోలీసులకు పిర్యాదు చేశారు.
 
 ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ, ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఒక్క ఎంపీపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయాయి. గద్వాల, కొల్లాపూర్, జడ్చర్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కొడంగల్ నియోజకవర్గంలో టీడీపీ అన్ని ఎంపీపీ స్థానాలను తమ పార్టీ ఖాతాలో వేసుకున్నాయి.
 

మరిన్ని వార్తలు